లక్నో: తండ్రి ములాయంసింగ్ యాదవ్‌కు పోటీగా అఖిలేశ్ యాదవ్ 235 మంది రెబల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్ ప్రకటించిన ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించకుండా వదిలేశారు. అందుకు కారణం అక్కడి నుంచి ములాయం రెండో కోడలు అపర్ణ పోటీ చేస్తుండటమే. ఆమెకు ఈ స్థానాన్ని ములాయం దాదాపు ఏడాది కిందటే ఖరారు చేశారు. 26 ఏళ్ల అపర్ణ శివ్‌పాల్ వర్గం వ్యక్తి.
యూపీ సీఎం అఖిలేశ్, ఆయన బాబాయ్, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఆధిపత్య గొడవ పరాకాష్టకు చేరి సమాజ్‌వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిన సంగతి తెలిసిందే. ఈ వర్గపోరులో పార్టీ అధినేత ములాయం కొడుకును కాదని తమ్ముడు శివ్‌పాల్‌కు మద్దతు పలికారు. ఇలా ములాయం తమ్ముడిని వేనకేసుకురావడానికి ఆయన రెండో భార్య సాధనాగుప్తే కారణమని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. సవతి తల్లి సాధనాగుప్తా అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ములాయంను ఎగుదోస్తున్నారని ఆ వర్గం పేర్కొంటున్నది.
ఈ ఆధిపత్య తగదా మరింత ముదరడానికి కారణం అపర్ణ యాదవ్ రాజకీయ ఆకాంక్షలే కారణమని వినిపిస్తోంది. ములాయం, సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్ సతీమణి అపర్ణ. ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కంటున్నారు. అంతేకాకుండా పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా ఆమెలో ఉందని అంటున్నారు. కొన్ని నెలల కిందట అఖిలేశ్, శివ్‌పాల్ గొడవ హోరాహోరీగా సాగుతుండగా పార్టీ ప్రజాప్రతినిధి అయిన ఉదయ్‌వీర్ సింగ్ లేఖ రాస్తూ.. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
డింపుల్.. అపర్ణ!
అపర్ణ యాదవ్ పోటీచేయబోతున్న లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ప్రస్తుతం రీటా బహుగుణ జోషీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువను లేదు. ఏదైనా సులువుగా గెలిచే స్థానంలో తనకు సీటు అపర్ణ ఇవ్వాలని కోరినా.. అది కుదరలేదు. దీంతో ఈ స్థానంలో గెలిచేందుకు అపర్ణ ఇప్పటినుంచే ప్రచారంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు అఖిలేశ్ భార్య డింపుల్ సులువుగా ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ సవతి సోదరుడు 28 ఏళ్ల ప్రతీక్ మాత్రం ఫిటినెస్ బిజినెస్‌లో కొనసాగుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభంలో ఆయన పాత్ర కూడా ఉందని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి అఖిలేశ్‌ను పార్టీ నుంచి గెంటేయడానికి పరిస్థితులు దారితీశాయంటే అది ములాయం రెండో భార్య సాధన, ఆయన రెండో కోడలు అపర్ణ వల్లేనని ఆయన వర్గం అంటోంది. కోసమెరుపు ఏమిటంటే.. ఎస్పీ నాయకురాలిగా ఎదగాలనుకుంటున్న అపర్ణ ప్రధాని నరేంద్రమోదీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్భంగా అపర్ణ, ప్రతీక్ కలిసి మోదీతో దిగిన సెల్ఫీ అప్పట్లో హల్‌చల్ చేసింది.