
కాంగ్రెస్ పార్టీ నా జీవితాన్ని నాశనం చేసింది
కాంగ్రెస్ పార్టీ నా జీవితాన్ని నాశనం చేసిందని ఎస్పీ నేత ములాయం మండిపడ్డారు.
- అప్పుడు కేసులు పెట్టించింది.. ఇప్పుడు ఎస్పీ పుట్టి ముంచింది
- ములాయం సింగ్ యాదవ్ తీవ్ర విమర్శలు
మోయిన్‌పురి: సమాజ్‌వాదీ పార్టీ కురువృద్ధుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. గతంలో తనపై కేసులు పెట్టించడం మొదలు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దాకా కాంగ్రెస్ తనను నిలువునా ముంచిందని అన్నారు. ఆదివారం తన సొంత నియోజకవర్గం మోయిన్‌పురిలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.
‘కాంగ్రెస్ పార్టీ నామీద ఎన్నో కేసులు పెట్టించింది. ఎన్నిరకాలుగా ఏడిపించాలో అంతా చేసింది. ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ దారుణంగా దెబ్బతిన్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇక నామీద విసరడానికి వాళ్ల(కాంగ్రెస్) దగ్గర రాళ్లేవీ లేవు’ అని ములాయం వ్యాఖ్యానించారు.
(బాబ్రీ)మసీదు కూల్చివేతకు కారణమైన పార్టీకి ముస్లింలు ఓట్లు వేయరని, కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు వద్దని ఎంత చెప్పినా అఖిలేశ్ వినిపించుకోలేదని ములాయం కార్యకర్తలకు వివరించారు. ‘227 స్థానాల నుంచి 47 స్థానాలకు పడిపోయాం. అదికూడా నేను, శివపాల్ గట్టిగా ప్రయత్నిస్తే గెలిచిన స్థానాలు! అసలు అఖిలేశ్‌ని కాకుండా నేనే ముఖ్యమంత్రిగా ఉండేదుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేదేకాదు’ అని చెప్పుకొచ్చిన ములాయం.. సమాజ్‌వాదీ పార్టీ మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.