సీనియర్ను కాల్చి.. తనను కాల్చుకుని...
ముంబయి: సెలవు వివాదంతో సీనియర్ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపి తననుతాను కాల్చుకుని చనిపోయాడు ఓ పోలీస్ అధికారి. ఈ ఘటన ముంబయిలోని వాకోలా పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దిలీప్ షిర్కే ఓ సెలవు తీసుకున్నాడు.
అయితే, ఈ సెలవుపై పైఅధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. దీంతో అతడు బాగా ఒత్తిడికి లోనయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. స్టేషన్ అధికారుల వివరాల ప్రకారం సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ విలాస్ జోషి గదిలోకి దిలీప్ వెళ్లాక వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతరం కాల్పుల చప్పుళ్లు వినిపించాయి. వెళ్లి చూసేవరకు సీనియర్ అధికారిపై కాల్పులు జరిపి దిలీప్ తనను తాను కాల్చుకున్నాడు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే దిలీప్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలతో పోరాడుతూ జోషి అర్థరాత్రి కన్నుమూశాడు. ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు.