హేమంత్
మచిలీపట్నం: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ఆమె స్నేహితుడు హేమంత్ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్యకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హేమంత్ ఆహార ప్యాకెట్స్ ఇచ్చి వెళ్లాడు. పోలీసులు అతనిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. హేమంత్ తండ్రి స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నత అధికారి అని తెలిసింది. హేమంత్ జెఎన్టియులో చదివాడు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా హేమంత్ను విచారిస్తున్నారు.
ముంబై పోలీసులు ఈ రోజు మచిలీపట్నం వచ్చారు. అనుహ్య బంధువుల వద్ద నుంచి ఆధారాలను, ఇతర సమాచారం సేకరిస్తున్నారు. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్‌లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆమెతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లు కెమెరాలో రికార్డ్ అయినట్లు కుర్లా రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్ శివాజీ దుమాల్ తెలిపారు. వారిద్దరూ టాక్సీ స్టాండ్ వైపు వెళ్తున్నట్లు కనిపించిందని, ఆ తరువాత వారు ఎటువెళ్లింది తెలియలేదని చెప్పారు. అతను ఈ ప్రాంతానికి చెందినవాడేమోనన్న అనుమానంతో పోలీసులు ఇక్కడ ఆరా తీస్తున్నారు.