
నరేంద్ర మోదీ నోట నా పేరు విని..
- భారత ప్రధాని వ్యాఖ్యలపై శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం
హైదరాబాద్: ‘తమిళజాతి ఆణిముత్యం ముత్తయ్య మురళీధరన్..’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నాడు శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్! ‘తన సందేశంలో నరేంద్ర మోదీ లాంటి గొప్ప నేత.. నా పేరు పలకడం గొప్ప అనుభూతి’ అని మురళీధరన్ అన్నాడు.
రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం డికోయా నగరంలో తమిళ ప్రజలను కలుసుకున్న నరేంద్ర మోదీ.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలోనే.. మురళీధరన్‌ను, దివంగత ఎంజీఆర్‌ను తమిళజాతి ఆణిముత్యాలుగా మోదీ కీర్తించారు.
ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న మురళీధరన్.. ఐపీఎల్-10లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మురళీ.. మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి దేశాన్ని నడిపిస్తోన్న నేత(మోదీ).. శ్రీలంకలో మా(తమిళ) కమ్యూనిటీని గురించి మాట్లాడటం గొప్పవిషయం’ అని మురళీ అన్నారు. శ్రీలంకకు భారత్ పెద్దన్నలాంటిదని, ఇరు దేశాలది గాఢానుబంధమని గుర్తుచేశాడు.
‘భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన తమిళుల్లో నేను ఐదో తరం వాడిని. పెళ్లి కూడా చెన్నైకి చెందిన అమ్మాయినే చేసుకున్నా. నిజానికి ఇరు దేశాలది చాలా క్లోజ్ రిలేషన్. పేదల కోసం ఎన్నో పనులు చేస్తోన్న నరేంద్ర మోదీని.. అందరిలాగే మేము కూడా ఇష్టపడతాం. ఆయన పాపులారిటీ ఏంటో ఎన్నికలప్పుడే తెలిసింది’ అని మురళీధరన్ పేర్కొన్నారు.