
విలీనం దిశగా ఎంఎఫ్ పథకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) రంగంలో రానున్న రోజుల్లో పలు పథకాల విలీనాల జోరు కనిపించనుంది. ఒకే రకమైన పథకాలను విలీనం చేస్తే, ఆ పథకాలలో ఇన్వెస్ట్ చేసేవారికి మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్న బడ్జెట్ ప్రతిపాదనే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం దాదాపు రూ.12 లక్షల కోట్లు విలువ ఉన్న ఎంఎఫ్ రంగంలో ఒకే లక్ష్యంతో నడిచే పథకాల ఏకీకరణకు దారితీయనుంది. పథకాల ఏకీకరణ వల్ల వాటి సంఖ్య తగ్గుతుంది. దీంతో వాటిని ఎంతో క్రియాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆనంద్ రాఠి ప్రైవేట్ వెల్త్ కంపెనీ డెరైక్టర్ ఫెరోజ్ అజీజ్ అన్నారు.
‘కేంద్ర ప్రభుత్వం ఒకే రకమైన పథకాలను విలీనం చేస్తే వాటికి పన్ను విధానంలో తటస్థ వైఖరిని అవలంబిస్తామని బడ్జెట్ లో ప్రతిపాదించింది. దీంతో రానున్న రోజుల్లో ఎంఎఫ్ రంగంలో పలు పథకాల విలీనాలు జరుగుతాయి’ అని యూటీఐ ఎంఎఫ్ గ్రూప్ ప్రెసిడెంట్ సూరజ్ కైలీ చెప్పారు. ఈ ప్రభుత్వ చర్య వల్ల భవిష్యత్తులో ఉత్పత్తుల హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. ఎంఎఫ్ రంగ ఏకీకరణ వల్ల ఇన్వెస్టర్లు సరైన పెట్టుబడిదారి నిర్ణయాలను తీసుకుంటారని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఇన్వెస్టర్లపై పన్ను భారం తగ్గుతుందని క్వాంటమ్ ఏఎంసీ సీఈఓ జిమ్మి పటేల్ అన్నారు.