‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..! | Nandamuri Kalyanram Ism, trendy facts | Sakshi
Sakshi News home page

‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..!

Published Thu, Oct 20 2016 5:24 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..! - Sakshi

‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..!

నందమూరి నటవారసులలో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరో కల్యాణ్‌ రామ్‌. దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్‌రామ్‌.. ఇప్పటివరకు భారీ సూపర్‌హిట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన తన తాజాచిత్రం ’ఇజం’  ద్వారా సూపర్‌హిట్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్‌ చిత్రం కోసం కల్యాణ్‌రామ్‌ ఎంతో కష్టపడ్డారు. సరికొత్త స్టైలిష్‌ లుక్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా గురించి టెండ్రీ కబుర్లు ఇవి..

కల్యాణ్‌ రామ్‌ మేకోవర్‌!
గత సినిమాలకు భిన్నంగా సరికొత్త రూపుతో ‘ఇజం’ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ కనిపించారు. కొన్ని నెలలపాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ కసరత్తులు చేసి, కండలు పెంచి.. సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. కండల తిరిగిన దేహంతో, సరికొత్త స్టైలిష్‌ లుక్‌తో కల్యాణ్‌రామ్‌ ’ఇజం’ ట్రైలర్‌లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ట్రైలర్‌లో ఆయన కొత్త లుక్‌, ఎనర్జీ దుమ్మురేపింది.

పూరి మ్యాజిక్‌!
టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకరు. మహేశ్‌ బాబుతో పోకిరి, బిజినెస్‌ మ్యాన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో టెంపర్‌, రవితేజతో ఇడియట్‌ వంటి భారీ కమర్షియల్‌ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన ఘనత పూరిది. కమర్షియల్‌ సినిమాలు తీయడంతో పూరిని మించినోడు లేడంటే అతియోశక్తి కాదేమో. అలాంటి మ్యాజిక్‌ను ‘ఇజం’ సినిమాలోనూ పూరి రిపీట్‌ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆదితి ఆర్య
2015లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ ఎంపికైన అందాల భామ ఆదితి ఆర్యకు ఇది తొలి సినిమా. 2015 మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలోనూ తను పాల్గొన్నది. కల్యాణ్‌ రామ్‌ సరసన టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ భామ అందచందాల పరంగా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. రంగస్థలం ప్రవేశం ఉండటంతో అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్టు చెప్తున్నారు.

యాక్షన్‌ సీక్వెన్స్
’ఇజం’ ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉనట్టు తెలుస్తోంది. కారు, బైక్‌ వంటి ఛేజింగ్‌ సీన్లతోపాటు పలు యాక్షన్‌ సీన్లు, మార్షల్‌ ఆర్ట్స్‌ పోరాట సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సినిమాలు తీయడంలో పూరి దిట్ట కావడంతో ‘ఇజం’లో ఆ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాక్షన్‌ సీన్లతోపాటు ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల కల్యాణ్‌ రామ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. సోషల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కంప్లీట్‌ యాక్షన్‌ సినిమా అయిన ‘ఇజం’ ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement