'ఇజం' మూవీ రివ్యూ
టైటిల్ : ఇజం
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య, జగపతి బాబు, పోసాని కృష్ణమురళి
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తరువాత విడుదలైన షేర్ సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అందుకే ఈ సారి గ్యారెంటీగా హిట్ కొట్టాలన్న కసితో సరికొత్త మేకోవర్, బాడీ లాంగ్వేజ్తో తొలిసారిగా ఓ స్టార్ డైరెక్టర్తో కలిసి పని చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్. అనుకున్నట్టుగా హిట్ సాధించాడా..?
కథ :
పరాయి దేశంలో ఉండి ఇండియాలోని పాలిటిక్స్ని బిజినెస్లను కంట్రోల్ చేస్తుంటాడు.., జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు). డబ్బు కోసం ఎలాంటి పనులకైనా సిద్ధపడే జావేద్కు కూతురు అలియా ఖాన్( అదితి ఆర్య) అంటే ప్రాణం. దేశాన్ని గడగడలాడించే జావేద్ భాయ్నే వణికించే వాణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అలియా. అలాంటి లక్షణాలున్న కళ్యాణ్ రామ్ ( కళ్యాణ్ రామ్) స్ట్రీట్ ఫైటర్గా అలియాకు పరిచయం అవుతాడు. అలియా, జావేద్ భాయ్ కూతురు అని తెలిసి కూడా ఆమె వెంటపడతాడు కళ్యాణ్.
ఈ విషయం తెలుసుకున్న జావేద్, కళ్యాణ్ను చంపేయాలనుకుంటాడు. కళ్యాణ్, జావేద్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అదే సమయంలో జావేద్ ఎక్కడుంటున్నాడు అన్న వివరాలతో పాటు, అతనితో సంబంధం ఉన్న బడా నేతల వివరాలు గ్రాండ్ లీకేజ్ కంపెనీ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతాయి. ఎంతో రహస్యంగా ఉన్న జావేద్ భాయ్ వివరాలు బయటకు ఎలా వచ్చాయి. అలియా వెంటపడ్డ కళ్యాణ్ ఎవరు? అతని అసలు పేరేంటి..? గ్రాండ్ లీకేజ్ కంపెనీకి కళ్యాణ్కు ఉన్న సంబందం ఏంటి..? చివరకు జావేద్ భాయ్ సామ్రాజ్యం ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
లుక్, బాడీలాంగ్వేజ్లను పూర్తిగా మార్చేసుకొని కొత్త అవతారంలో కనిపించిన కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో స్ట్రీట్ ఫైటర్గా అల్లరి పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్తో మరింతగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాల పాటు సినిమా వన్ మేన్ షోగా నడిచింది. అదితి ఆర్య నటిగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా లుక్స్ పరంగా మాత్రం అలరిస్తుంది. విలన్గా జగపతి బాబు మరోసారి సూపర్బ్ అనిపించాడు. దేశాన్ని గడగడలాండిచే కార్పోరేట్ డాన్గా స్టైలిష్గా కనిపిస్తునే, కూతురి కోసం ఏమైనా చేసే తండ్రిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళీ, తనికెళ్ల భరణి లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
సినిమా తొలి ఫ్రేం నుంచి ఇది పక్క పూరి మార్క్ సినిమా అన్నట్టుగా తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ముఖ్యంగా తొలి భాగం అంతా పూరి గత సినిమాల ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. హీరోయిన్ వెంటపడి అల్లరి చేసే హీరో, డబ్బు కోసంఎలాంటి పనికైనా సిద్దపడే విలన్ లాంటి క్యారెక్టర్లు గతంలో పూరి సినిమాల్లో కనిపించినవే. దీనికి తోడు తొలి భాగం అంతా అసలు కథలోకి ఎంటర్ అవ్వకుండా హీరో హీరోయిన్ల ప్రేమకథతో నడిపించేయటం కాస్త విసిగిస్తుంది.
ఇంటర్వెల్ తరువాత సినిమాలో వేగం పెరుగుతోంది. ముఖ్యంగా జర్నలిస్ట్ల కష్టాలు, విలువలు తెలిపేలా పూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లు సినిమాకే హైలెట్గా నిలిచాయి. పాటల విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండనిపించింది, ఒక్క సాంగ్ కూడా గుర్తుండిపోయేలా లేదు. పాటలతో నిరాశపరిచినా.. నేపథ్యం సంగీతంతో ఆకట్టుకున్నాడు అనూప్ రుబెన్స్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోగానే కాక నిర్మాతగానూ సినిమాకు వందశాతం న్యాయం చేశాడు కళ్యాణ్ రామ్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్ గా నిర్మించాడు.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
పాటలు
ఓవరాల్గా ఇజం, నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచే పూరి మార్క్ ఎంటర్టైనర్
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్