సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కిష్టారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. కిష్టారెడ్డి మృతి నేపథ్యంలో నిర్వహించే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సభదృష్టికి తెచ్చారు. ఆయన కుటుంబం నుంచి ఒకరు ఏకగ్రీవంగా సభకు వచ్చేలా సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని పక్షాల నేతలు సహకరించాలని కోరారు.
ఇదే ఆయనకు సమర్పించే నివాళి అన్నారు. అయితే అంతకుముందు మాట్లాడిన సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం.. మాటమాత్రంగా కూడా ఈ విషయాన్ని పేర్కొనకపోవటం విశేషం. పార్టీ సభ్యులు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణలు కూడా ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై సీఎం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.
దశాబ్దాల అనుబంధం: సీఎం
మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తనకు కిష్టారెడ్డితో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంద ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలున్న నేతగా కొనసాగారని, సభలో ఆవేశకావేశాలు ఏర్పడితే సర్దిచెప్పేం దుకు యత్నించే వారన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ.. తాను, కిష్టారెడ్డి ఒకేసారి సమితి అధ్యక్షులుగా ఎన్నికై, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని గుర్తుచేసుకున్నారు. ప్రతి విషయంలో పార్టీలకతీతంగా కిష్టారెడ్డి సూచనలు సలహాలు ఇచ్చేవారని టీడీఎల్పీ నేత దయాకరరావు అన్నారు.
రాజకీయాల్లో షార్ట్‌కట్స్ ఉండవని, ప్రజల కోసం పనిచేస్తే ఎదుగుదల సాధ్యమని నిరూపించిన నేత కిష్టారెడ్టి అని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. వివాదరహితుడుగా రాజకీయ జీవితం గడిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మజ్లిస్, సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. కిష్టారెడ్డికి సంతాపం వ్యక్తం చేసే సమయంలో గీతారెడ్డి భావేద్వేగానికి లోనయ్యారు. ఒకదశలో కన్నీళ్లు పెట్టుకుని, కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండిపోయారు.
నారాయణ్‌ఖేడ్ ఎన్నిక ఏకగ్రీవం చేద్దాం
Published Thu, Sep 24 2015 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement