సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాకముందే అసంతృప్తి రాజుకుంటుందా?.. దీని కోసం ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే అలకలు షురూ అయ్యాయా?.. పార్టీకి చెందిన మాజీ ఎంపీలంతా ఇటీవల హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని పరిశీలిస్తే అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖేడ్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పార్టీలోని ఇరు వర్గాలు కూడా తమ నాయకుడికే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నాయి. ఎలాగైనా ఈసారి తమ నాయకుడు పోటీలో ఉంటారని ఇరువర్గాల కార్యకర్తలు చెబుతున్నారు.
తొలి జాబితాలో దక్కని చోటు
కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ తొలి జాబితాలో ఖేడ్‌కు చోటు దక్కలేదు. రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఈసారైనా నియోజకవర్గం టికెట్ ప్రకటిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చాకే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ
కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో భేటీ అయ్యారు. అందులో నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న సురేష్‌షెట్కార్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ రాని ఈ మాజీ ఎంపీలంతా సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నారాయణఖేడ్‌లో పార్టీ కేడర్ చాలా ఏళ్లుగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే బీఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టికెట్ రెండో జాబితాలో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment