
బాధ్యతారాహిత్యమే కారణం: మోడీ
ప్రభుత్వ విధానాల వల్లనే ఈ ఆర్థిక దుస్థితి
యూపీఏపై నరేంద్ర మోడీ ధ్వజం
గాంధీనగర్/అహ్మదాబాద్: ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే దేశ ఆర్థిక దుర్దశకు ప్రధాన కారణమని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం వల్లనే దేశంలో నిరాశ అలముకుని ఉందన్నారు. ‘ఇక్కడే నాయకత్వ ప్రాధాన్యత కనిపిస్తుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఫిక్కీ సమావేశంలో బుధవారం మాట్లాడుతూ.. ఆయన యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి తరచూ సమ్మిళిత అభివృద్ధి అంటుంటారు.
విద్య, తదితర అవకాశాలను అందించడం ద్వారా పేదల్లో సామర్థ్యాన్ని పెంపొందించనంతవరకు అదెలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. అభివృద్ధిలో సామాన్యుడిని భాగస్వామిని చేయాలని మోడీ సూచించారు. విలువైన ఖనిజాలను ఎగుమతి చేస్తూ పోతే, ఉపాధి అవకాశాలు లభించబోవన్నారు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి చాలా అవకాశాలున్నప్పటికీ.. ప్రణాళికాలోపం వల్ల సామర్థ్యానికి తగ్గట్లుగా విజయాలు సాధిం చలేకపోతున్నామన్నారు. ప్రజలు, పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసాన్ని పాదుకొల్పడం ద్వారానే ఆ పరిస్థితిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. ‘అభివృద్ధి కావాలంటే మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు ఇంధనరంగంపై ఆధారపడి ఉంటాయి.
ఇంధనం లభించక పరిశ్రమలు మూతపడ్తున్నాయి. ఇలాంటప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఎవరూ అందుకు ముందుకు రాకపోవడమే బాధాకరం’ అని అన్నారు. వ్యవసాయ, సేవారంగాలు అత్యంత ప్రధానమైనవని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉన్న రక్షణ, రైల్వే రంగాలు తమ అవసరాలకనుగుణంగా సొంతంగా వర్సిటీలను స్థాపించుకోవాలని సూచించారు. తాను సానుకూల దృక్పథం కలిగిన వాడినని చెప్తూ.. సగం నీరున్న గ్లాసును చూపిస్తే.. మిగతా సగం ఖాళీగా లేదని, గాలితో నిండి ఉందని చెబుతానన్నారు. తన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. ‘పాట్నా పేలుళ్ల సమయంలో మీరెందుకు పారిపోలేదని కొందరు అడిగారు. పారిపోయే వాడే అయితే మోడీ అసలు జన్మించకపోయేవాడు అని వారికి చెప్పాను’ అన్నారు.