కీలక దశకు నయీం కేసుల దర్యాప్తు
గ్యాంగ్‌స్టర్ నయీం, అతని అనుచరులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షునిగా బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్... మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీం కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు.
ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు. వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఏడీజీ అంజనీకుమార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక కోర్టుల్లో ఎక్కడిక్కడ దాఖలు చేయాలని సూచించారు. నయీం కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టయిన 80 మంది కూడా అతని కుటీంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. అయితే నయీం ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నయీం అనుచరుల నుంచీ ఈ కోణానికి సంబంధించి కీలకాంశాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ...
ఎన్‌కౌంటర్ తర్వాత నుంచి నయీం కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రముఖులతో సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా... కొందరు నేతలపై ఓ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్‌స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే నమోదైన వాటిలో కేవలం కబ్జా, బెదిరింపుల ఆరోపణలతో కూడిన వాటిని ఈలోపే కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కషిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. గత ఆగష్టు 8న నయీంను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత అతని ఆగడాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నయీం కేసులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సిట్ సేకరించింది. అయితే నయీమ్‌ను ఉపయోగించుకొని కొందరు రాజకీయ నేతలు లాభపడ్డారనే విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు విషయంలో రాజకీయపార్టీల ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
నెల రోజులు పూర్తయినా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ, దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదంటూ కొందరు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులను పెంచిన ఉన్నతాధికారులు... కేసును కొలిక్కి తీసుకుచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది.