నయీమ్ కేసులో ఎవరినీ వదలం: నాయిని
సాక్షి, మెదక్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్ప గించబోమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సిట్ నివేదిక అందాక దోషులని తేలితే ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో స్టాఫ్ క్వార్టర్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. నయీమ్‌తో పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోబోమని తెలిపారు.
సీడబ్ల్యూసీకి నయీమ్ బాధిత చిన్నారులు
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ డెన్‌లో గుర్తించిన 8 మంది చిన్నారులను నల్లగొండ బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)కి సోమవారం మహబూబ్‌నగర్ అధికారులు అప్పగించారు. వీరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె షామ కూడా ఉంది. చిన్నారుల పేర్లను కూడా మార్చి రికార్డుల్లో నమోదు చేయడంతో వారి రక్త సంబంధీకులు ఎవరనేది తేలాల్సి ఉంది. నాలుగేళ్ల బాలుడు జానీపాష అలియాస్ పాలేద్‌తోపాటు మరో ఇద్దరిది సూర్యాపేట జిల్లా నేరెడుచర్లగా, ఓ బాలికది హుజూర్‌నగర్ అని అధికారులు గుర్తించారు.