కాంగ్రెస్‌ను జనంలో ఎండగట్టండి | NDA marches to 'Save Democracy' | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను జనంలో ఎండగట్టండి

Published Fri, Aug 14 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

కాంగ్రెస్‌ను జనంలో ఎండగట్టండి

కాంగ్రెస్‌ను జనంలో ఎండగట్టండి

ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు.

ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం
* ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’ చేపట్టిన ఎన్డీఏ

న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు.  గురువారం మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ విసిరిన అప్రజాస్వామిక సవాల్‌ను మేము స్వీకరిస్తున్నాం.

దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఒక కుటుంబాన్ని రక్షించడం కాంగ్రెస్ సిద్ధాంతమైతే... బీజేపీ సిద్ధాంతం మాత్రం దేశాన్ని రక్షించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ఎంపీలు, మంత్రులు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల ఎంపీలున్న నియోజకవర్గాలను లక్ష్యంగా ఎంచుకోవాలని తన 25 నిమిషాల ప్రసంగంలో హితవుపలికారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అప్రజాస్వామిక చర్యలతో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుందంటూ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసింది.
 
బ్లేమ్ గేమ్...
అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మాటల యుద్ధంతో పార్లమెంటు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో తదుపరి కార్యాచరణపై ఆ రెండు పార్టీలు దృష్టిపెట్టాయి. పరస్పర నిందాస్త్రాలు సంధించుకున్నాయి. గురువారం పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడిన వెంటనే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమై కాంగ్రెస్ తీరును ఎండగట్టగా, రాహుల్ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నెలరోజుల పాటు విపక్ష ఎంపీ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్డీఏ నిర్ణయించింది. అనంతరం ఎన్డీఏ ఎంపీలంతా విజయ్ చౌక్ నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’ నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీలతోపాటు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement