అందుకే తన పేరు 'భారతీ' అని పెట్టా...
కఠ్మాండు: రెండు పెను భూకంపాలకు గురై ప్రాణాలతో బయటపడిన నేపాల్కు చెందిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భూకంపం సందర్భంగా తమ దేశానికి విలువైన సేవలు అందిస్తున్న భారతదేశంపై గౌరవంతో తన కూతురుకు ఆస్పత్రిలోనే 'భారతి' అని నామకరణం చేసింది. ఏప్రిల్ 25 భారీ భూకంపం సంభవించడంతోపాటు దాని నుంచి తేరుకునే క్రమంలో తాజాగా మే 12 మరోసారి భారీ భూకంపం నేపాల్ను వణికించిన విషయం తెలిసిందే.
ఈ రెండోసారి భూకంపం బారిన పడిన భావనా సాప్కోటా పుదాసైని అనే గర్భవతిని అక్కడ సహాయక చర్యలు అందిస్తున్న భారత సైన్యం రక్షించడమే కాకుండా అక్కడే భారత్ తరుపున ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి వైద్యం అందించారు. అందులోనే ఆమె శుక్రవారం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భూకంపం బారిని పడిన తమ దేశానికి ఎంతో గొప్ప సాయాన్ని అందిస్తూ వెన్ను దన్నుగా నిలుస్తున్న భారత్ అంటే తనకు అమితమైన ఇష్టమని, గౌరమని అందుకు చిహ్నంగానే తన కూతురుకు భారతి అని పేరు పెట్టినట్లు పుదాసైని తెలిపింది.