ఖమ్మం జిల్లా ఇల్లెందు సబ్‌డివిజన్‌లో న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
చంద్రన్న వర్గానికి చెందిన 40 మంది అరెస్ట్
ఇల్లెందు: ఖమ్మం జిల్లా ఇల్లెందు సబ్‌డివిజన్‌లో న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం గుండాల మండలం మర్కొడు అటవీ ప్రాంతంలో న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం సాగర్ దళం.. వన్యప్రాణి సంరక్షణ విభాగం సిబ్బంది, మొక్కలు నాటేందుకు వెళ్లిన ఒడిశా కూలీలను నిర్బంధించడంతో పాటు దాడి చేసిన ఘటనలో చంద్రన్న వర్గం లీగల్ నేతలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలో న్యూడెమోక్రసీకి పట్టున్న మండలాల్లో సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే, న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజయ్, కామేపల్లి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బయ్యూరం సింగిల్‌విండో చైర్మన్ రామగిరి భిక్షం, ఇఫ్టూ రాష్ట కార్యదర్శి జె సీతారామయ్య, రైతుకూలీ సంఘం నేత అమృ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.