షో షురూ... | New generation SUV from Hyundai | Sakshi
Sakshi News home page

షో షురూ...

Published Thu, Feb 6 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

షో షురూ...

షో షురూ...

అంగరంగ వైభవంగా 12వ భారత ఆటో షో అరంభమైంది. దేశ, విదేశీ కంపెనీలు కొత్త కొత్త వేరియంట్‌లు, కాన్సెప్ట్ కార్లతో ఆటో షోను ముంచెత్తుతున్నాయి. ఈ ఆటో షోతోనైనా  డిమాండ్ పుంజుకుని సుదీర్ఘ మందగమనానికి తెరపడుతుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ)లు సంయుక్తంగా ఈ ఆటో షోను నిర్వహిస్తున్నాయి.

స్థలాభావం చేత ఈ సారి ఆటో షో రెండు చోట్ల జరుగుతోంది. గ్రేటర్ నోయిడాలో మోటార్ షో, ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శన జరుగుతోంది.  ఆటో షోలో బుధవారం ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌లు సందడి చేశారు. ఆ ఆటోషోకు ఈ నెల 7 నుంచి 11 వరకూ సందర్శకులను అనుమతిస్తారు. టికెట్లు రూ.200, రూ.500గా నిర్ణయించారు.
 
 1. హస్టర్ బైక్(650 సీసీ)తో హీరో మోటోకార్ప్      సీఈవో, ఎండీ పవన్ ముంజాల్

 2. జనరల్ మోటార్స్ షెవర్లే 2014 కర్వెట్టి స్టింగ్‌రేతో మోడల్స్

 3. హార్లే డేవిడ్సన్ అత్యంత చౌక బైక్(ధర రూ.4.1 లక్షలు)ను ఆవిష్కరించిన హర్లే డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్
 4. టాటా మోటార్స్ కాన్సెప్ట్ కారు నెక్సన్‌తో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ
 
 గ్రేటర్ నోయిడా: దేశ, విదేశీ వాహన కంపెనీలు కాన్సెప్ట్ కార్లు, కొత్త వేరియంట్‌లతో ముంచెత్తాయి.  మారుతీ సుజుకి కంపెనీ రెండు కాన్సెప్ట్ కార్లు- సెడాన్ సియాజ్, క్రాసోవర్ ఎస్‌ఎక్స్4 ఎస్-క్రాస్‌లను ఆవిష్కరించింది.  స్విఫ్ట్, ఆల్టో, రిట్జ్, ఎర్టిగ, డిజైర్ వేరియంట్‌లతో సహా మొత్తం 14 విభిన్నమైన మోడళ్లను ఈ కంపెనీ డిస్‌ప్లే చేసింది. హ్యుందాయ్ కంపెనీ కొత్త జనరేషన్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ శాంటా ఫేను ఆవిష్కరించింది.

 ధరలు రూ. 26.3 లక్షలు నుంచి రూ.29.2 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఫోర్డ్  కంపెనీ రెండు మిడ్-సైజ్ సెడాన్‌లు ఫియస్టా, ఫిగో కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది.  టాటా మోటార్స్ రెండు కాన్సెప్ట్ కార్లు-నెక్సన్(కాంపాక్ట్ ఎస్‌యూవీ), కనెక్ట్ నెక్స్‌ట్‌లతో పాటు మొత్తం 18 కార్లను  డిస్‌ప్లే చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన రెనో కంపెనీ క్విడ్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. స్ట్టీరింగ్ కుడి, ఎడమ వైపున కాకుండా మధ్యలో ఉండడం ఈ కార్ ప్రత్యేకత.  జనరల్ మోటార్స్ కంపెనీఎస్‌యూవీ షెవర్లే ఆడ్రాను డిస్‌ప్లే చేసింది.

 ఇక టయోటా కంపెనీ కొరిల్లా ఆల్టిస్‌లో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఫియట్ కంపెనీ మూడు కార్లు-అవెంచుర మల్టీ పర్పస్ వెహికల్, అబర్త్ 500 హ్యాచ్‌బాక్‌లను ఆవిష్కరించింది. హోండా కంపెనీ రెండు మోడళ్లు-హోండా మొబిలియో, థర్డ జనరేషన్ హోండా జాజ్‌ను ఆవిష్కరించింది. వీటితో పాటు హోండా విజన్ ఎక్స్‌ఎస్-1(కాన్సెప్ట్ యుటిలిటి వెహికల్), ఎస్‌ఎస్‌ఎక్స్ కాన్సెప్ట్, అకార్డ్ హైబ్రిడ్‌లనూ డిస్‌ప్లే చేసింది. ఫోక్స్‌వ్యాగన్  కాన్సెప్ట్ ఎస్‌యూవీ తైగన్‌ను ఆవిష్కరించింది. ఇసుజు మోటార్స్ రూ.7-9 లక్షల  రేంజ్‌లో ధర ఉండే  మల్టీయుటిలిటి పికప్ ట్రక్- ఇసుజు డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్‌ను ఆవిష్కరించింది. ప్రభుత్వ అనుమతులు రాగానే క్వాడ్రిసైకిల్, ఆర్‌ఈ60ను మార్కెట్లోకితెస్తామని బజాజ్  తెలిపింది.

 హార్లే డేవిడ్సన్ చౌక బైక్
 ఇక టూవీలర్ల  విషయానికొస్తే, హర్లే డేవిడ్సన్ అతి చౌక బైక్, స్ట్రీట్ 750ను ఆవిష్కరించింది. ధర రూ.4.1 లక్షలు. స్ట్రీట్ 750 బైక్‌తో పాటు  ఫ్యాట్ బాయ్, స్ట్రీట్ బాబ్, స్ట్రీట్ గ్లైడ్ తదితర మోడళ్లను కూడా డిస్‌ప్లే చేసింది. వీటి ధరలు రూ.4.1 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.  దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ 100 సీసీ కేటగిరిల్లో రెండు కొత్త బైక్‌లను - స్ప్లెండర్ ప్రొ క్లాసిక్, ప్యాసన్ టీఆర్‌లను ఆవిష్కరించింది.

 



 లగ్జరీ కార్ల జోరు...
 వీఐపీల కోసం బుల్లెట్‌ప్రూఫ్ ఎస్‌యూవీ ఎంఎల్-గార్డ్‌ను మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ధర రూ.2.49 కోట్లు.  మరో లగ్జరీ కంపెనీ ఆడి సెడాన్ ఏ3ను లాంఛనంగా ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ కంపెనీ కూడా నాలుగు కార్లను ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో(ధర రూ.42.75 లక్షలు), ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎ6 గ్రాన్ కూప్‌లను డిస్‌ప్లే చేసింది. ఈ కార్లను క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement