కొత్త పెట్టుబడులు పెట్టం
గాయత్రి ప్రాజెక్ట్ ్స ఎండీ సందీప్ కుమార్ రెడ్డి
కొన్నాళ్ల పాటు ప్రస్తుత ప్రాజెక్టులపైనే దృష్టి
రెండేళ్లలో రూ. 5,000 కోట్ల ఆదాయం సాధిస్తాం
మరికొంత కాలం ఇన్‌ఫ్రాకు గడ్డుకాలమే
మంచి ధర వస్తేనే బీవోటీ ప్రాజెక్టులను విక్రయిస్తాం
రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో వ్యాపారం తగ్గింది
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో కొంత కాలం పాటు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటామని గాయత్రి గ్రూప్ స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణ, విద్యుత్, చక్కెర, ఆతిథ్యం వంటి పలు రంగాల్లో విస్తరించిన ఈ గ్రూపు... ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను లాభాల్లోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలియజేసింది. రహదారులు, రైల్వేలు సహా ఇతర నిర్మాణ రంగ ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెబుతున్న ‘గాయత్రి ప్రాజెక్ట్స్’ ఎండీ టి.వి.సందీప్‌కుమార్ రెడ్డి... ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఇన్‌ఫ్రా రంగంలో ఏమైనా వృద్ధి కనిపిస్తోందా? రోజుకు 30 కి.మీ నిర్మాణ లక్ష్యం కుదురుతోందా?
దేశీయ ఇన్‌ఫ్రా రంగానికి గడ్డు రోజులు పూర్తిగా పోయాయని చెప్పలేం. కానీ ఇప్పుడిప్పుడే కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఏ కంపెనీకి కూడా సొంత నిధులతో ప్రాజెక్టులను చేపట్టే శక్తి లేదు. ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఉంది. ఈ నిధుల్ని సమకూర్చడానికి మోదీ ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది. ఈపీసీ విధానంలో ఇప్పుడిప్పుడే రోడ్డు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తోంది. గడచిన ఆరు నెలల్లో మేం సుమారు రూ.4,000 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను దక్కించుకున్నాం. మున్ముందు కేంద్ర లక్ష్యానికి తగ్గట్టు రోజుకు 30 కి.మీ. నిర్మాణం, జాతీయ రహదారులను 95,000 కి.మీ. నుంచి 1.50 లక్షల కి.మీ. పెంచటం వంటివి సాధ్యం కావటం కష్టమేమీ కాదు.
సగంలో ఆగిపోయిన బీవోటీ ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక సాయం ఇస్తానంటోంది. మీ సంస్థకూ ఇలాంటివేమైనా...?
మేం 8 బీవోటీ ప్రాజెక్టులు చేపట్టాం. వీటిలో ఏడు పూర్తయ్యాయి. ఒకటి నిర్మాణంలో ఉంది. ఇవేవీ కేంద్రం ప్రకటించే ఆర్థిక సహాయం పరిధిలోకి రావు. కానీ ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటం వల్ల క్లెయిమ్స్ రావాల్సి ఉంది. ఎంత మొత్తం రావాలన్నది ఇంకా లెక్కించలేదు.
రోడ్డు ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నారన్న వార్తలు నిజమేనా?
రోడ్డు ప్రాజెక్టుల నుంచి వైదొలగడం లేదు. బీవోటీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు విక్రయించాలనుకుంటున్నాం. కాకపోతే అమ్మేవారు ఎక్కువ కావడంతో కొనేవారు చాలా చౌకగా అడుగుతున్నారు. ప్రస్తుతం మా బీవోటీ ప్రాజెక్టులేవీ నష్టాలను అందించడం లేదు. అలా అని లాభాలు కూడా ఇవ్వడం లేదు. అయితే తక్కువ రేటుకు అమ్మాల్సినంత అవసరం మాకు లేదు. ఈ లోగా వడ్డీరేట్లు దిగొస్తే ఈ ప్రాజెక్టులు లాభాలివ్వటం మొదలవుతుంది. ఈ ఏడాదిలో ఒక ప్రాజెక్టు విక్రయం కూడా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మంచి ధర వస్తేనే విక్రయిస్తాం.
క్రమంగా దిగివస్తున్న వడ్డీరేట్లు, పెరుగుతున్న వాహనాల ట్రాఫిక్ దేశీయ ఇన్‌ఫ్రా రంగానికి శుభ సూచనలేగా?
ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనం కంపెనీలకు ఇంకా అందలేదు. గతంలో 9 శాతం మీద తీసుకున్న రుణాలకు ఇంకా 11 శాతంపైనే వడ్డీ చెల్లిస్తున్నాం. గత రెండేళ్లతో పోలిస్తే ట్రాఫిక్ పెరిగినా... ఆ ప్రయోజనాన్ని ద్రవ్యోల్బణం దెబ్బతీస్తోంది. దీనిక్కారణం ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్దేశించే టోల్ ఫీజులే. టోకు ధరల సూచీ నెగటివ్ జోన్‌లోకి వెళ్ళడంతో టోల్ ఫీజులు తగ్గాయి. అలాగే మాకు చెందిన 3 టోల్ రోడ్డుల్లో ప్రధానమైన హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై రాష్ట్ర విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో ఇసుక రవాణా తగ్గి ఆ మేరకు ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులేమైనా చేపట్టే అవకాశం ఉందా? కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా వైదొలుగుతారా?
కొత్తగా పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులేవీ కొన్నాళ్లపాటు తీసుకోం. ఏ రంగంలోనైనా కాంట్రాక్టులు మాత్రమే తీసుకుంటాం. ఇక 2600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టులో మెజార్టీ వాటా సింగపూర్‌కు చెందిన సెంబకార్ప్ తీసుకుంది. ఇప్పుడు ఈ యూనిట్ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏడాది మొత్తం ఇదే విధంగా పనిచేస్తే ఈ ప్రాజెక్టు నుంచే రూ.8,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఆ మేరకు మాకు రూ.3,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇంధన సరఫరా, లాభదాయకమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరితే ఇక్కడే విస్తరించడానికి చాలా స్థలం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి విస్తరణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టే ఆలోచన లేదు.
వచ్చే రెండేళ్లలో గాయత్రి గ్రూపు వ్యాపార లక్ష్యాలేంటి?
అప్పులు తగ్గించుకుని వాటాదారులకు లాభాలందించడమే మా లక్ష్యం. ఇపుడు గాయత్రీ ప్రాజెక్ట్స్‌కి రూ.1,600 కోట్ల రుణాలున్నాయి. ఇందులో ప్రధాన వాటా రోడ్డు, విద్యుత్ రంగానిదే. ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టు లాభాల్లోకి రావడంతో అప్పులు తగ్గించుకునే వెసులుబాటు కలుగుతోంది. చేతిలో రూ. 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఈ ఏడాది రూ.2,500 కోట్లు ఆర్డర్లు పూర్తి చేయాలని లక్ష్యించాం. ఈ ఏడాది గాయత్రీ ప్రాజెక్ట్స్ ఆదాయం రూ.2,000 కోట్ల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే రెండేళ్లు 30 శాతం వార్షిక వృద్ధి నమోదు కావచ్చు. ఇక గ్రూపు మొత్తం ఆదాయం సుమారుగా రూ.3,000 కోట్లు. రెండేళ్లలో ఇది రూ.5,000 కోట్ల మార్కును అధిగమిస్తుంది. రైల్వే ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతున్నాం. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు బిడ్లు వేశాం.