ఇక అందరికీ ఒకే యూనిఫామ్
వెల్లింగ్టన్: పాఠశాలస్థాయి నుంచే లింగ వివక్షను నిర్మూలించాలన్న ఉద్దేశంతో న్యూజిలాండ్‌లోని ఓ పాఠశాల యూనిఫామ్ విషయంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులైనా, విద్యార్థినులైనా ఒకేరకమైన యూనిఫామ్ ధరించేలా కోడ్‌ను రూపొందించింది. దక్షిణ ఐస్‌లాండ్‌లోని డునెడిన్ నార్త్ ఇంటర్మీడియట్ స్కూల్‌కు చెందిన విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. తమకు మగపిల్లల్లా ప్యాంటు, షర్ట్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో పాఠశాల యాజ మాన్యం అనుమతిచ్చింది.
అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రమే మగపిల్లల్లా యూనిఫామ్ వేసుకొని రావడంతో.. చాలామంది వారిని ఆటపట్టించడం మొదలుపెట్టారు. నువ్వు అమ్మాయివా? అబ్బాయివా? అంటూ పాఠశాల సిబ్బందే ప్రశ్నిం చడంతో.. మరోసారి విద్యార్థినులంతా మరోసారి యాజమాన్యం దగ్గరకు వచ్చారు. దీంతో యూని ఫామ్ విషయంలో మార్పులు చేర్పులు చేయాలని భావించి... లింగభేదం లేకుండా అంతా ఒకే యూనిఫామ్ వేసుకొచ్చేలా నిబంధనలు రూపొం దించారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లో లింగసమానత్వాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.