హెచ్-1బీ వీసా దెబ్బ: నష్టాల్లో మార్కెట్లు
Published Fri, Jan 6 2017 4:40 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
టెక్నాలజీ స్టాక్స్లో నెలకొన్న ఆందోళనలు, లాభాల స్వీకరణ మార్కెట్లకు దెబ్బకొట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 119.01 పాయింట్లు పడిపోయి 26759.23 వద్ద ముగియగా.. 30 పాయింట్లు పడిపోయి నిఫ్టీ 8243.80 పాయింట్ల వద్ద సరిపెట్టుకుంది. హెచ్-1బీ వీసాల్లో నెలకొన్న ఆందోళనతో ఐటీ షేర్లు ఢమాల్ మనిపించాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహింద్రా, మైండ్ట్రీ, ఎంపాసిస్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్1బి వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన ‘అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్)’ బిల్లును కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీ సబ్-ఇండెక్స్ కనీసం 3 శాతం పడిపోయింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహింద్రాలు దాదాపు 4.5 శాతం మేర పడిపోయాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. కొటక్ మహింద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలనార్జించడంతో బ్యాంకు నిఫ్టీ 0.82 శాతం పెరిగింది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర పెంపుకు కళ్లెం పడి 34 రూపాయలు నష్టపోయింది. 10 గ్రాముల బంగారం ధర 27,914గా నమోదైంది.
Advertisement