అసద్‌పై ట్రంప్ యూటర్న్.. ఇక గద్దె దించుడే!
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని అమెరికా కుండబద్దలు కొట్టింది. సిరియాలో తాజాగా జరిగిన రసాయన దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఈ మేరకు యూటర్న్ తీసుకొంది. అసద్ పదవి నుంచి వైదొలగడం అనివార్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు.
సిరియాలో రెబెల్స్ అధీనంలో ఉన్న ఖాన్ షిఖౌన్ పట్టణంలో జరిగిన రసాయనిక దాడిలో 89 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అసద్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మంగళవారం ఏకంగా సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. రసాయని దాడికి గురైన ప్రజల దయనీయ ఫొటోలను చూసి ఖిన్నుడైన ట్రంప్.. రెబెల్స్‌పై దాడులకు కారణమైన పశ్చిమ సిరియాలోని షాయరత్ వైమానిక స్థావరాన్ని పేల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా సీఎన్‌ఎన్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నిక్కీ హెలీ ’అసద్‌ను కూలదోయడం మా ప్రాధాన్యం. అంతేకాకుండా మరోవైపు ఐఎస్‌ఐఎస్‌ను ఓడించడానికీ ప్రయత్నిస్తున్నాం. అసద్ ఉన్నంతకాలం సిరియాను శాంతియుతంగా చూడలేం. ఇరాన్ ప్రభావాన్ని కూడా తొలగించాల్సిన అవసరముంది. చివరగా సిరియాలో రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటాం’ అని చెప్పారు.
ఒకవైపు ఐఎస్‌ఐఎస్‌పై పోరాడుతూనే.. మరోవైపు అసద్‌ను గద్దె దించాలని చూడటం మూర్ఖత్వమని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసింది. రసాయనిక దాడికి ముందు కూడా అసద్‌ను గద్దె దించడం తమ ప్రాధాన్యం కాదని ట్రంప్ సర్కారు పేర్కొంది. కానీ, రసాయనిక దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో రష్యా మద్దతున్న అసద్‌ను గద్దె దించితీరుతామని స్పష్టం చేసింది. మరోవైపు గుడ్డిగా అసద్‌ను వెనకేసుకొస్తున్న రష్యా.. ఈ విషయంలో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది.