నిర్భయ తీర్పు: డిఫెన్స్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు | Nirbhaya verdict: Slaughter of human rights, says defence lawyer AP Singh | Sakshi
Sakshi News home page

నిర్భయ తీర్పు: డిఫెన్స్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, May 5 2017 4:57 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

నిర్భయ తీర్పు: డిఫెన్స్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు - Sakshi

నిర్భయ తీర్పు: డిఫెన్స్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తుది తీర్పుపై నిందితుల తరఫు న్యాయవాది(డిఫెన్స్‌ లాయర్‌) ఏపీ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు..  జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన అంహిస సిద్ధాంతానికి విరుద్ధమని, ముమ్మాటికీ మానవహక్కుల ఉల్లంఘనేనని గర్హించారు.

నిర్భయ దోషులకు కింది కోర్టులు విధించిన ఉరిశిక్ష సరైందేనని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన డిఫెన్స్‌ లాయర్‌ ఏపీ సింగ్‌.. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

‘సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో కోర్టులు ఉరి శిక్షలు వేయడం సరికాదు. నిర్భయ కేసులో ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుతో మానవహక్కులు హత్యకు గురయ్యాయి. మాకు న్యాయం దక్కలేదు. కాబట్టి తప్పకుండా రివ్యూ పిటిషన్‌ దాఖలుచేస్తాం. తీర్పు కాపీ అందిన తర్వాత ఆ మేరకు ముందుకు వెళతాం’ అని డిఫెన్స్‌ లాయర్‌ ఏపీ సింగ్‌ అన్నారు.

ఆ నలుగురిని ఎప్పుడు ఉరి తీస్తారు?
నిర్భయ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు, ఢిల్లీ హైకోర్టులు జారీచేసిన మరణశిక్షలను సవాలు చేస్తూ నిందితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణల అనంతరం శుక్రవారం తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో దోషులను ఎప్పుడు ఉరి తీస్తారనేది కీలకంగా మారింది. నేటి సుప్రీం ధర్మాసనం తీర్పు.. కింది కోర్టులు విధించిన శిక్షను సమర్థించాయే తప్ప, ఉరి అమలు తేదీలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. నిర్భయ కేసు మొదట విచారించిన ప్రత్యేక న్యాయస్థానమే ఉరితీతపై నిర్ణయం తీసుకుంటుదని, తీర్పు కాపీలు అందిన వెంటనే సంబంధిత న్యాయమూర్తులు ఈ మేరకు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా దోషులను ఉరితీయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరుతున్న సంగతి తెలిసిందే.
(చదవండి: నిర్భయ కాదు.. జ్యోతి అని పిలుద్దాం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement