
ఢిల్లీ : సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ కుమార్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ముఖేశ్ తన క్షమాబిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో చివరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ దగ్గరకు వచ్చిన క్యురేటివ్ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో నిర్భయ నిందితులను ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6గంటలకు ఉరి తీసేందుకు అన్ని మార్గాలు సుగమమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన అన్ని అనుమతుల ప్రతులను రాష్ట్రపతికి ప్రభుత్వం పంపించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ముఖేశ్ దరఖాస్తు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్‌ను జనవరి 17న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. (జైల్లో లైంగికంగా వేధించారు)
ముఖేశ్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఉరి తేది దగ్గర పడుతున్న కొద్ది దోషులు ఎలా తప్పించుకోవాలో తెలియక పిటీషన్ల పేరుతో కాలాయాపన చేస్తున్నారని ఆరోపించారు.