
20న నితీశ్ ప్రమాణం!
దీపావళి, ఛత్ పండుగలు ముగిశాకే కొత్త సర్కారు: జేడీయూ
♦ బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి పక్షాల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయి
♦ లాలూ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో.. నితీశ్‌కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 20వ తేదీన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బుధవారం (11వ తేదీ) దీపావళి పండుగ ఉండగా.. దాని తర్వాత వచ్చే ఛత్ పండుగ ఈ నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రజలు ఈ పండుగల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి.. ఛత్ ముగిసిన తర్వాత నితీశ్ ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు బశిష్ట నారాయణ్‌సింగ్ మంగళవారం పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఈ నెల 20వ తేదీన కొత్త సర్కారు కొలువుతీరే అవకాశముందని ప్రస్తుతం ముగియనున్న నితీశ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు సంకేతాలిచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయని.. ఏ పార్టీ నుంచి స్పీకర్‌ను ఎన్నుకోవాలి అనే అంశంతో పాటు.. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమారుడు తేజస్విని ఉప ముఖ్యమంత్రిని చేయాలా అన్న అంశంపైనా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ పదవీ కాలం ఈ నెల 29వ తేదీ వరకూ ఉందని.. కాబట్టి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయటానికి తొందరేమీ లేదని సీఎం నితీశ్ ఆదివారం నాడు పేర్కొన్నారు. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న నితీశ్.. ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం విశేషం. ఆయన తొలిసారి 2000 సంవత్సరంలో సీఎంగా ప్రమాణం చేశారు. అయితే కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. అనంతరం 2005లో అధికారంలోకి వచ్చిన నితీశ్, మళ్లీ 2010లోనూ సీఎం అయ్యారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినటంతో సీఎం పదవి నుంచి తప్పుకున్న నితీశ్.. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జితన్‌రాంమాంఝీని తప్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.