
సై అంటే సై: సీఎం, డిప్యూటీ సీఎం సవాళ్లు
పట్నా: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య విసిరిన సవాల్‌ను బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్వీకరించారు. ఎన్నికలను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ మళ్లీ తాజాగా ఎన్నికలకు జరిపించాలని అన్నారు. బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి తిరుగులేదనుకుంటే 2019 సాధారణ ఎన్నికల వరకు ఆగక్కర్లేకుండా బిహార్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేపీ మౌర్య సవాల్ విసిరారు. యూపీ మాదిరిగా బిహార్‌లోనూ కమలం వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానిగా మోదీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రోజుల పాటు మౌర్య రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నితీశ్‌పై విరుచుకుపడ్డారు. ‘నితీశ్‌కు అధికారం పట్ల వ్యామోహం ఉంది. అధికారం లేకుండా ఆయన ఉండలేరు. తన పని(అభివృద్ధి) పట్ల నమ్మకం ఉంటే తాజాగా ఎన్నికలకు వెళ్లి బలం నిరూపించుకోవాల’ని అన్నారు.
మౌర్య సవాల్‌పై నితీశ్ స్పందించారు. ‘బిహార్‌లో రేపే ఎన్నికలకు వెళదాం. బీజేపీ నాయకులకు దమ్ముంటే యూపీలోనూ ఎన్నికలకు సిద్ధం కావాలి. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచిన లోక్‌సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, తాజాగా ఎన్నికలు జరిపించాల’ని నితీశ్ కుమార్ అన్నారు.