
నితీశ్ అహంభావి.. నమ్మొద్దు!
అభివృద్ధి ఎజెండాను విశ్వసించి, ఎన్డీయేను గెలిపించండి!
బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
బాంక(బిహార్) : అభివృద్ధి ఎజెండా, ముఖ్యమంత్రి నితీశ్‌పై విమర్శలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచార పర్వం ప్రారంభించారు. బాంకలో శుక్రవారం జరిగిన సభలో మాట్లాడుతూ ‘నితీశ్ కుమార్ అహంభావి. ఆయనను విశ్వసించి పరిపాలనను అప్పగించవద్దు. బీజేపీ అభివృద్ధి ఎజెండాను నమ్మండి. రాష్ట్ర రూపురేఖలను మారుస్తాం. అభివృద్ధితోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని పేదలు, యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తానన్నారు.
తాను ప్రకటించిన రూ. 1.65 లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ‘ఈ ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఇచ్చినా, అది మీ దాకా చేరుతుందా? ఒకవేళ నేను ఆ మొత్తాన్ని ఇచ్చినా.. ఆయన(నితీశ్) ఎంత అహంభావి అంటే.. మోదీ ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని అన్నా అంటాడు. కోసి వరదల సందర్భంగా సహాయ చర్యల కోసం బిహార్‌కు గుజరాత్ సీఎంగా నేను పంపిన రూ. 5 కోట్లను ఆయన వెనక్కుపంపించిన విషయం గుర్తుంది. నేనాయన్ను నమ్మను. మీరూ నమ్మొద్దు’ అంటూ నితీశ్‌పై విమర్శలు గుప్పించారు.
తాను ప్రకటించిన రూ. 1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ బిహారీల హక్కు అన్నారు. భూస్వామ్యవాదం, ప్రత్యేకవాదం, రాచరికవాదం.. ఇలా అన్నిరకాల వాదాలను అనుభవించారని, ఇక అభివృద్ధివాదాన్ని అనుసరించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం వ్యాపారానికి అనువుగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్‌ది 27వ స్థానం కాగా.. బిహార్ నుంచి విడిపోయిన తరువాత బీజేపీ పాలనలో ఉన్న జార్ఖండ్ 3వ స్థానంలో ఉందని వివరించారు. ‘బిహార్ ప్రగతి నా బాధ్యత. అందుకే మీ ఓట్లు కోరుతూ నేనిక్కడికి వచ్చాను’ అని ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్డీయే గెలుపు ఖాయమనే అర్థం వచ్చేలా.. ‘పరిస్థితి చూస్తోంటే బిహార్ ప్రజలు ఈసారి రెండు దీపావళులు జరుపుకుంటారు’ అని అన్నారు. కాగా, ప్రస్తుతమున్న రిజర్వేషన్ విధానంలో మార్పులు చేయాలని బీజేపీ భావించడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్జేడీ నేత లాలూ, నితీశ్‌లను ఔరంగాబాద్‌లో జరిగిన ఎన్నికల సభలో విమర్శించారు. ఎన్డీయే గెలుస్తుందనే భయంతోనే లాలూ-నితీశ్ కూటమిగా ఏర్పడ్డారని, త్వరలోనే వారిలో విభేదాలు ప్రారంభమై, కూటమి ముక్కచెక్కలవుతుందని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్.. మరో సభలో పేర్కొన్నారు.