
ఉద్యోగానికి, జీతానికి నో ఢోకా: అరుంధతీ
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో ఉద్యోగులు వేతనాలను, ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సినవసరం లేదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య హామీ ఇచ్చారు. ఉద్యోగాలకు, వేతనాలకు ఎలాంటి ఢోకా ఉండదని వెల్లడించారు.కేవలం కొన్ని బదిలీలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. దీనికి బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం బంద్ చేయాల్సినవసరం లేదని వ్యాఖ్యానించారు. బ్యాంకు ఉద్యోగులు ఈ విషయంపై బంద్ చేపట్టినప్పటికీ, వచ్చే మార్చికల్లా భారతీయ మహిళా బ్యాంకుతోపాటు, ఇతర ఐదు అనుబంధబ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.
విలీనానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు టైమ్లైన్ గా నిర్ణయించినట్టు ఆమె చెప్పారు.మార్పు అనివార్యతను వారు అర్థం చేసుకోవాలన్నారు. ఎస్బీఐలో ఐదు అనుబంధబ్యాంకుల విలీనాన్ని, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా శుక్రవారం రోజు 10లక్షల బ్యాంకు ఉద్యోగులు వన్ డే బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.బ్యాంకు విలీనాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ విలీనంతో ఎస్బీఐ దిగ్గజం రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్గా ఆవిర్భవించబోతోంది.