చల్లటి మాట చెప్పిన టీసీఎస్
ముంబై: ఐటి కంపెనీల భారీ ఉద్యోగాలకోతతో ఆందోళనలో ఉన్న టెకీలకు ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) శుభవార్త అందించింది. ఒకవైపు దిగ్గజ టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంటే టీసీఎస్ సమీప భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా మరింతమంది ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామంటూ తీపికబురు అందించింది.
ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కొత్త బీపీవో కేంద్రాన్ని గురువారం లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల కోతపై ప్రశ్నించినపుడు ఖచ్చితంగా అలాంటి ప్రణాలికలేవీ లేవని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా మరింత మందిని టెక్ నిపుణులు నియమించుకోనున‍్నట్టు తెలిపారు. టిసిఎస్ అధికార ప్రతినిధి ప్రదీప్ బాజీ మాట్లాడుతూ డిటిటల్ ఇండియా ఇనీషియేషన్ తో భవిష్యత్తులో దేశీయ ఐటి రంగంలో మరింత ప్రకాశవంతంగా ఉండనుందన్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ కావడానికి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.
దేశీయ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉద్యోగులను తగ్గించుకుంటోంటే టీసీఎస్ ప్రకటన ఆహ్వానించతగినదని మార్కెట్‌నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా టిసిఎస్ 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ పొందిన కన్సల్టెంట్లు 387,000 మంది ఉన్నారు. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 17.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది.