వీసా, వర్క్ పర్మిట్ లేకుంటే మొబైల్ కనెక్షన్ కట్
- వలసదారులపై సౌదీ నిరంకుశత్వం
- అటు జీతాలు రాక, ఇటు కుటుంబంతో మాట్లాడలేక తెలుగు కార్మికుల అవస్థలు
మోర్తాడ్(నిజామాబాద్): అసలే తిండిలేక అల్లాడుతున్న వలసదారుల పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న వలసదారుల మొబైల్ ఫోన్లలో రీచార్జి చేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. మొబైల్ లో రీచార్జి చేయాలంటే.. ఫోన్ నంబర్ తోపాటు వీసా, వర్క్ పర్మిట్ నంబర్లను కూడా జత చేస్తేనే బ్యాలెన్స్ రీచార్జి అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సౌదీలో రూపొందించారు. గతంలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి సిమ్‌కార్డు తీసుకుంటే ఎప్పుడంటే అప్పుడు సెల్ రీచార్జి చేసుకునే వీలు ఉండేది.
సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ తదితర ప్రముఖ కంపెనీలతోపాటు, ఇతర చిన్న, చిన్న కంపెనీలు మూతపడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. కంపెనీలను మూసివేసిన యాజమాన్యాలు కార్మికులకు బకాయిపడిన వేతనం చెల్లించకపోవడమే కాకుండా కార్మికుల పాస్‌పోర్టులు, వీసా, వర్క్ పర్మిట్‌లను సైతం తమ అధీనంలోనే ఉంచుకున్నాయి. దీంతో కార్మికులకు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. ఒక్కో కార్మికుడికి తొమ్మిది నుంచి 12 నెలల వేతనంను కంపెనీలు చెల్లించాల్సి ఉంది. వేతనం చెల్లింపు విషయం ఎలా ఉన్నా కనీసం పాస్‌పోర్టు ఇస్తే ఇంటికి వెళ్లడానికి దారి దొరికేది. కానీ, కంపెనీ యాజమాన్యాలు మాత్రం కార్మికుల పాస్‌పోర్టులను ఇవ్వకుండా వీధినపడేయడంతో కార్మికులు పార్కులలోను, తమకు తెలిసినవారి గదుల్లో ఆశ్రయం పొందుతున్నారు. బయట చిన్నా చితక పనులు చేసుకుంటు రోజులు గడుపుతున్నారు.
పాస్‌పోర్టు, వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న కార్మికులపై ఉక్కు పాదం మోపిన సౌదీ పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసి ఔట్ జైళ్లలో బందీలుగా ఉంచారు. పోలీసుల అరెస్టులకు బయపడిన కార్మికులు కొందరు మాత్రం రహాస్య జీవనం గడుపుతున్నారు. అయితే, సెల్‌ఫోన్ రీచార్జి నిలుపుదల చేస్తే అక్రమంగా ఉంటున్న వలసదారులు ఇబ్బందులకు గురైతారని భావించిన సౌదీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్యాలెన్స్ లేని మొబైల్ ఫోన్లకు ఇన్‌కమింగ్ కాల్స్ కేవలం ఒక నెల వరకే పరిమితం చేస్తున్నారు. దీంతో ప్రతి మొబైల్ ఫోన్‌లో బ్యాలెన్స్ రీచార్జి చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది తెలుగు కార్మికుల సెల్‌ఫోన్‌లు మూగబోయాయి. దీంతో వారి కుటుంబాలతో బంధం తాత్కలికంగా తెగిపోయింది. ఔట్ పాస్‌పోర్టులను జారీ చేస్తే తమ సొంత గ్రామాలకు వెళ్లిపోతామని కార్మికులు చెబుతున్నా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు.