నేను ఇంకా ఆ ముసాయిదాను పరిశీలించలేదు.. వీలైతే శుక్రవారం హోంశాఖ అధికారులతో చర్చిస్తా
హైదరాబాద్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
నోట్ రూపొందించినా.. అది నేటి కేబినెట్ భేటీ ముందుకు రాకపోవచ్చంటున్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. వైద్య పరీక్షలు, గణపతి నిమజ్జనోత్సవాల కోసం వారం రోజులకు పైగా ముంబైలో గడిపిన అనంతరం గురువారం ఢిల్లీ తిరిగి వచ్చిన షిండే నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదు. వీలైతే నోట్‌పై రేపు (శుక్రవారం) హోంశాఖ అధికారులతో చర్చిస్తా..’’ అని చెప్పారు. హైదరాబాద్ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించడం గమనార్హం.
అత్యున్నత స్థాయిలో చర్చ తర్వాతే కేబినెట్ ముందుకు..
హోం శాఖ తెలంగాణపై ముసాయిదా నోట్ రూపొందించినప్పటికీ శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో జరగబోయే కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై అత్యున్నత స్థాయిలో లోతైన చర్చ జరిగిన తర్వాత, వివాదాస్పద అంశాలపై రాజకీయ నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే నోట్‌కు తుది రూపమివ్వడం సాధ్యమని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోట్ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు వెళ్తుందని చెబుతున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రమే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ప్రధాని అందుబాటులో లేని కారణంగా రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు సర్కులేట్ చేసిన సమావేశ అజెండాలో తెలంగాణ అంశం లేకపోయినప్పటికీ.. చివరి నిమిషంలో అనుబంధ చర్చనీయాంశాల జాబితాలో లేదా టేబుల్ ఐటమ్‌గా దీన్ని మంత్రివర్గం ముందుంచే అవకాశం లేకపోలేదని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. హోంశాఖ సమర్పించే ప్రాథమిక నివేదికను పరిగ ణనలోకి తీసుకున్న తర్వాత.. విభజన విషయంలో లోతైన అధ్యయనం, సంప్రదింపుల కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
హైదరాబాద్‌పై మూడు ప్రత్యామ్నాయాలు?
హైదరాబాద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షిండే వెల్లడించిన నేపథ్యంలో.. హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్‌లో ఏముందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలోనే షిండే ప్రకటించిన మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచి ఉంటారని, దీనిపై రాజకీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచించినట్లుగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చండీగఢ్ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలా లేదా ఢిల్లీ మాదిరిగా రాజధానిలో శాంతి భద్రతలు, రెవెన్యూ, పన్ను వసూళ్లను కేంద్రం అధీనంలో ఉంచాలా లేదా హైదరాబాద్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించి దేశానికి రెండో రాజధాని చేయాలా అన్న ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వెలువడడం తెలిసిందే.
తెలంగాణ నోట్ రెడీ: షిండే
Published Fri, Sep 20 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement