చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరు
రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్షాల పిలుపు
హైదరాబాద్: చీప్‌లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగుతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీ(చీప్ లిక్కర్)ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ లేదా సిరిసిల్ల నుంచే ఉద్యమానికి శ్రీకారం చూట్టాలని నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మద్య వ్యతిరేక ఉద్యమం’ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపాలంటూనే చీప్ లిక్కర్ అమ్మకాలను పెంచాలనుకోవడం తగదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు తీర్మానం చేయాలని సూచించారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో సారాపై పోరాడతామన్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తే వాటినిప్పుడు రద్దు చేసి సారా ఇస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేత ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమించకుంటే ప్రభుత్వం సారాగ్రిడ్‌ను కూడా తీసుకువస్తుందని తెలంగాణ ఉద్యమవేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో సామాజిక ఉద్యమనేత వీజీఆర్ నారగోని, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డా. శ్రవణ్, ఆప్ నేతలు నమ్రత, వెంకటరెడ్డి, పద్మశాలీ సంఘం నేత టి.నాగయ్య, మా జీ ఎమ్మెల్యే బి.బిక్షమయ్యగౌడ్, ప్రజాసంఘాల నేతలు బెల్లయ్య నాయక్, మంజీలాల్ నాయక్, షకీల, బి.శోభారాణి, బాలలక్ష్మి పాల్గొన్నారు.
మద్యం పాలసీ ఉపసంహరించాలి: సీపీఐ
హైదరాబాద్: పేదల సామాజిక, ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీని వెం టనే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. గుడుంబాను అరికట్టాలంటే చీప్‌లిక్కర్ అమ్మడం ప్రత్యామ్నాయం కాదని, బెల్ట్‌షాపుల ద్వారా ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడుతోందని, వాటి ని యంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించిన తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు.