
చంద్రబాబు గురించి మాట్లాడకపోతే పొరపాటే..
గుంటూరు : ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహార దీక్షకు సీపీఎం సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం వైఎస్ జగన్ దీక్షా స్థలిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు అలవికాని వాగ్దానాలు ఇచ్చి...అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తుంగలోకి తొక్కిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోకపోవటం చాలా పొరపాటు అవుతుందని, ముఖ్యమంత్రిగా ఆయనకు కనీసం నిజాయితీ కూడా లేదని విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక హోదా తెస్తానన్న బాబు...ఇప్పుడు ప్యాకేజీతో సరిపెడతానంటున్నాడని మధు ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏ రోజు అయితే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో ఆ రోజే రాష్ట్రంలోని రైతులకు కష్టాలు మొదలైయ్యాయని మధు మండిపడ్డారు. ఏపీ రాజధాని శంకుస్థాపన అదిరిపోవాలంటున్న చంద్రబాబు.... రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ఎలా అదిరగొట్టాడో అందరం చూశామని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ చేయటానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు ...రాజధాని శంకుస్థాపనకు మాత్రం రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని మధు నిప్పులు చెరిగారు. ఇదంతా ఎవడబ్బ సొమ్మని సభా ముఖంగా చంద్రబాబును నిలదీశారు.