
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐదేళ్లపాటు నిషేధం విధించింది. 2017లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఖలీద్ పాత్ర ఉండటంతో ఐదేళ్లపాటు అతను అన్ని ఫార్మెట్లలోనూ క్రికెట్ ఆడకుండా నిషేధించింది.
పీఎస్‌ఎల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడిన ఖలీద్ పీసీబీ అవినీతి వ్యతిరేక నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్టు ఆరు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరు అభియోగాల్లోనూ అతను దోషిగా తేలడంతో పీసీబీ ఈమేరకు చర్య తీసుకుంది. అంతేకాకుండా అతనిపై రూ. 10లక్షలు (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర తీర్పు వెలువడిన అనంతరం ఖలీద్ లతీఫ్ 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లతీఫ్ అప్పీల్ చేస్తాడా లేదా? అన్నది వేచిచూస్తామని పీసీబీ తరఫు న్యాయవాది తెలుపగా.. అప్పీల్ చేసే అవకాశం ఉందని లతీఫ్ తరఫు న్యాయవాది బాదర్ ఆలం తెలిపారు.