
ఉగ్రవాద గ్రూపులతో మంత్రి మంతనాలు!
ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చిన ‘ఇస్లామాబాద్ ముట్టడి’ కి గడువు దగ్గరపడుతుండటంతో పాకిస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది.
ఇస్లామాద్: ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చిన ‘ఇస్లామాబాద్ ముట్టడి’ కి గడువు దగ్గరపడుతుండటంతో పాకిస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే నెల 2న తలపెట్టిన ఈ ఆందోళనను ఎట్టిపరిస్థితుల్లో భగ్నం చేయాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ ప్రభుత్వం భారీగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పాక్ హోంమంత్రి నిసార్ అలీఖాన్ ఏకంగా రెండు నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో సమావేశమయ్యారు. ఇమ్రాన్‌ఖాన్ చేపడుతున్న ఆందోళనలో ఈ రెండు గ్రూపులు కూడా పాల్గొంటాయేమోనన్న భయంతో వాటిని బుజ్జగిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వచ్చే నెల 2న ‘ఆక్యుపై ఇస్లామాబాద్’ పేరిట రాజధానిని పూర్తిగా స్తంభిస్తామని హెచ్చరించింది. ఈ ఆందోళనలో తాము కూడా పాలుపంచుకుంటామని డిఫ్‌షే పాకిస్థాన్ కౌన్సిల్ (డీసీసీ) అధినేత మౌలానా సమివుల్ హక్ ప్రకటించారు. మతంలోని విభిన్నవర్గాలను షరీఫ్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. తాలిబన్ గాడ్‌ఫాదర్‌గా పేరొందిన సమివుల్ ప్రకటనతో షరీఫ్ సర్కారులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో సమివుల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం హోంమంత్రి నిసార్‌తో భేటీ అయి మంతనాలు జరిపింది. ఆయనతోపాటు నిషేధిత హర్కతుల్ ముజాహిద్దీన్ (హెచ్‌యూఎం) స్థాపకుడు మౌలానా ఫజ్లర్ రెహమాన్ ఖలీల్, నిషేధిత అహ్లే సున్నత్ వాల్ జమాత్‌కు చెందిన మౌలానా మహమ్మద్ అహ్మద్ లుథిన్వి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. హర్కతుల్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ నిషేధించడంతో ఖలీల్ అన్సర్ ఉల్ ఉమ్మా సంస్థను స్థాపించారు. ఇమ్రాన్ ఆందోళనలో పాల్గొనవద్దని ఈ గ్రూపుల ప్రతినిధులను హోంమంత్రి కోరినట్టు సమాచారం. మరోవైపు ఎలాగైనా ఇమ్రాన్ ఖాన్ ఆందోళనను భగ్నం చేసేందుకు ఆయనతోపాటు ఆ పార్టీ చెందిన సీనియర్ నేతలను అరెస్టు చేసి నిర్బంధించాలని షరీఫ్ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.