
సార్క్ సదస్సును వాయిదా వేసిన పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఈ ఏడాది నవంబర్ లో ఇస్లామాబాద్ లో జరగనున్న 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో సదస్సును నిర్వహించబోయే తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. సమావేశాన్ని తేదీల మార్పుకు కారణం భారతేనని ఆరోపించింది.
సదస్సులో పేదరికంపై చర్చించాల్సివున్నా దాన్ని కాదని భారత్ సదస్సును బహిష్కరించిందని విమర్శించింది. భారత్ తో పాటు సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంకలు సదస్సులో పాల్గొనడం కుదరదని ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఆ దేశంలో జరిగే సదస్సు హాజరుకాలేమని ఈ నెల 27న భారత్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.