పాకిస్థాన్కు మరో షాక్
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్ను ఏకాకికి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సార్క్ సభ్య దేశాలను తమ వైపుకు తిప్పుకోవడంలో భారత్ విజయవంతమైంది. పాకిస్థాన్లో జరిగే సార్క్ సదస్సును బహష్కరిస్తున్నట్టు మాల్దీవులు ప్రకటించింది. ఇంతకుముందు భారత్ సహా బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సార్క్ సభ్య దేశాల్లో పాక్ ఏకాకి అయ్యింది.
షెడ్యూల్ ప్రకారం నవంబర్లో పాకిస్థాన్లో సార్క్ సదస్సు జరగాల్సివుంది. కాగా ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం ఈ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. అంతేగాక ప్రపంచ దేశాల్లో పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నించింది. ప్రపంచ దేశాలు ఉడీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారత్కు బాసటగా నిలిచాయి. ఇక దక్షిణాసియా దేశాలు కూడా ఏకతాటిపై నిలిచాయి. భారత్ బాటలోనే అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు.. సార్క్ సదస్సును బహిష్కరించాయి.
దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమిలో మొత్తం ఎనిమిది దేశాలున్నాయి. సార్క్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు సభ్య దేశాలు. గత సార్క్ సమావేశం 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది.