
పాక్‌లో ఎట్టకేలకు జనాభా గణన
ఇస్లామాబాద్: రెండు దశాబ్దాల తరువాత తొలిసారిగా పాకిస్తాన్ జనాభా లెక్కలు నిర్వహించనుంది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం రెండు లక్షల మంది సైనికులను, అధికారులను నియమించారు. జనగణన ద్వారా వచ్చిన సమాచారాన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, శాసనసభ స్థానాల పునర్విభజనకు ఉపయోగిస్తారు. రెండుదశల్లో మే 25 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని పాక్ సైనికాధికారులు ప్రకటించారు.
జనాభా లెక్కలు సేకరించే అధికారి వెంట భద్రత కోసం ఒక సైనికుడిని నియమిస్తారు. సమాచార సేకరణలో సైనికులు కూడా సహకరిస్తారు. ఇందుకోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చే పౌరులకు రూ.50 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు. పాకిస్తాన్‌లో చివరిసారిగా 1998లో జనాభా లెక్కలు నిర్వహించగా, దేశ జనాభా 18 కోట్లని తేలింది.