విశ్వాసపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా నిలబడినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం సభ్యులు లేకుండానే నిర్వహించిన బలపరీక్షలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు.
బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు.