
కిలో ఉప్పు రూ.250!
మొరాదాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నలుగురు మరణించారు కూడా. కేంద్రం చర్యతో నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతాయని వదందతులూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వదంతులను నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్ లో కిలో ఉప్పు ధర ఏకంగా రూ.250లకు ఏగబాకిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్ నుంచి వెలువడిన వార్తలను బట్టి ఆ రాష్ట్రంలో ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలు భయాందోళనల్లో మునిగిపోయారు. ఇందుకు కారణం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణంలో కిలో ఉప్పు రూ.250లకు అమ్ముతున్నారనే వార్తలు వినిపించడమే.
వార్తలపై స్పందించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సత్యేంద్ర సింగ్ పుకార్లను కొట్టిపారేశారు. ఉప్పుకు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. పుకార్లు సృష్టించిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. పుకార్లను పట్టించుకోవద్దని లక్నో ఐజీ ప్రజలను కోరారు.