38 వేల అడుగుల నుంచి విమానం జారింది!
38 వేల అడుగుల నుంచి విమానం జారింది!
Published Mon, Jun 30 2014 5:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
షికాగో: గాల్లో ప్రయాణిస్తున్న అమెరికా విమానం ఒక్కసారిగా 38 వేల అడుగుల నుంచి 11 వేల అడుగులకు జారి పోవడంతో ప్రయాణికులు తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆకాశంలోనే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైనట్టు సమాచారం. అయితే పైలట్ చాకచక్యంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 101 మంది ప్రయాణీకులు ఊపిరి తీసుకున్నారు.
లాస్ ఎంజెలెస్ నుంచి షికాగోకు ప్రయాణిస్తున్న విమానం కేవలం 12 నిమిషాల్లో 38 వేల అడుగుల నుంచి 11 వేల అడుగులకు జారి పోయింది. దాంతో అత్యవసర ల్యాండింగ్ కోసం కాన్సస్ లోని విచితాకు విమానాన్ని మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10.30 నిమిషాలకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ 1463 ఫ్లైట్ మిడ్ కాంటినెంట్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా దిగింది.
అత్యవసరంగా ల్యాండింగ్ అయిన అనంతరం ఓ గంట తర్వాత ప్రయాణీకులను వేరే విమానంలో తరలించారు. ఈ ఘటన జరిగినపుడు 96 మంది ప్రయాణీకులు, ఐదుగురు విమాన సిబ్బంది విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. విమానం జారి పోవడానికి కారణమైన లోపాలపై నిపుణులు దృష్టి పెట్టారు.
Advertisement