Published
Mon, Feb 13 2017 11:35 AM
| Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి
నిన్న మొన్నటి వరకు బోసిపోయిన పోయెస్ గార్డెన్స్ ఒక్కసారిగా శశికళ మద్దతుదారులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలువురు మద్దతుదారులు, కార్యకర్తలు పోయెస్ గార్డెన్స్ వద్దకు వెల్లువెత్తారు. పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్నారని, కానీ ఒకరోజు ఆలస్యమైనా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కచ్చితంగా చిన్నమ్మేనని ఆమె మద్దతుదారులు అన్నారు. ఇంతకుముందు వరకు ఎక్కడ చూసినా జయలలిత ఫొటో మాత్రమే కనిపించగా, ఇప్పుడు అక్కడకు చేరుకున్న అందరివద్ద జయలలిత, శశికళ ఇద్దరూ ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి.
తమకు కావల్సింది చిన్నమ్మేనని, ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయమని మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. గవర్నర్ ఎందుకంత మౌనంగా ఉన్నారని.. ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్ద ఉన్నది ఏడు- ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని, వాళ్లతోనే ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తారని, అసెంబ్లీలో బలం ఎలా నిరూపించుకుంటారని మండిపడ్డారు. మొత్తమ్మీద ఇన్నాళ్ల తర్వాత మళ్లీ శశికళకు క్షేత్రస్థాయి మద్దతు కొంతవరకు కనిపించినట్లు అయింది.