పరమత సహనం పాటించాలి!
హిందూ, ముస్లింలు పేదరికంపై ఉమ్మడిపోరు చేయాలి
నేతల బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దు
లాలూ యాదవులను, బిహార్‌ను అవమానించారు
లౌకిక కూటమి అధికారంలోకి వస్తే జంగిల్ రాజ్ 2నే..
బిహార్ ఎన్నికల {పచారంలో ప్రధాని మోదీ
నవడ/బెగుసరాయి: ‘పోరాటం చేయాల్సింది ముస్లింలతోనా లేక పేదరికంతోనా అనేది హిందువులు నిర్ణయించుకోవాలి. యుద్ధం చేయాల్సింది హిందువులతోనా లేక దారిద్య్రం తోనా అనేది ముస్లింలు ఆలోచించుకోవాలి. ఇద్దరూ కలసి పోరు సాగించాల్సింది పేదరికంపై అన్న విషయం గుర్తించాలి. దేశమంతా ఒక్కటిగా సాగాలి. ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వం, మత సహనం.. ఇవే మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేవి. రాజకీయ నేతలు చేసే బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. అలాంటి వ్యాఖ్య లు నేను చేసినా సరే పట్టించుకోవద్దు.’ అని ప్రధాని నరేంద్రమోదీ హితవు పలికారు. దాద్రీ ఘటన, తదనంతర బీజేపీ నేతల మత విద్వేష వ్యాఖ్యలపై మోదీ స్పందించడం లేదన్న విమర్శకులకు గురువారం బిహార్ ఎన్నికల సభల్లో ఆయన ఇలా స్పష్టమైన సమాధానమిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘మీరెవరి మాటనైనా వినాలి అనుకుంటే గౌరవ రాష్ట్రపతి సూచనలను పాటించండి. 125 కోట్ల భారతీయులకు నిన్న ఆయన చెప్పిన మాటలను మించిన స్ఫూర్తి, దార్శనికత లేదు’ అన్నారు. ‘భిన్నత్వం, క్షమ, సహ నం, బహుళత్వం.. అనాదిగా మనకు వారసత్వంగా వస్తున్న ఈ నాగరికత విలువలను వ్యర్థం చేసుకోవద్దు. శతాబ్దాలుగా ఈ విలువలే మనల్ని కలిపి ఉంచుతున్నాయి. ప్రాచీన నాగరికతలెన్నో నాశనమయ్యాయి. కానీ ఈ విలువల వల్లనే భారతీయ నాగరికత ఎన్నో దురాక్రమణలను తట్టుకుని నిలిచింది’ అంటూ బుధవారం ఓ కార్యక్రమంలో ప్రణబ్ పలికిన పలుకులను మోదీ గుర్తు చేశారు.
ఆ దయ్యానికి మీరే దొరికారా..!?
మోదీ ప్రచారంతో బిహార్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నవడ, బెగుసరాయి, ముంగర్, సమస్తిపూర్‌ల్లో జరిగిన సభల్లో మోదీ పాల్గొన్నారు. తన ప్రసంగాల్లో ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌యాదవ్‌ను లక్ష్యంగా చేసుకున్న మోదీ.. హిందువులు కూడా బీఫ్ తింటారన్న వ్యాఖ్యలతో యాదవులను,బిహార్‌ను లాలూ అవమానించారని ధ్వజమెత్తారు. ‘మొత్తంగా ఆయన(లాలు) చెబుతున్నదేంటి? యాదవులంతా ఏం తింటా రు? ఇది బిహార్ ప్రజలను, యదువంశీయులను అవమానించడం కాదా? లాలూజీ.. ఈ యదువంశీయుల సహకారంతోనే మీరీ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారినే అవమానిస్తున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘ఏదో దయ్యం ఆవహించి ఆ బీఫ్ వ్యాఖ్యలు చేశాన’ంటూ లాలూ వివరణ ఇచ్చారంటూ.. ‘ఆ దయ్యం ఆవహించడానికి దేశంలో మరెవ్వరూ దొరకలేదా? లాలూ శరీరమే దొరికిందా? ఈయన కూడా దాన్ని బంధువులను ఆహ్వానించినట్లు ఆహ్వానించి ఉంటాడు’ అంటూ ఎద్దేవా చేశారు.
‘నాది గుజరాత్. శ్రీకృష్ణుడి ద్వారక ఉన్న ప్రాంతం. గోవులను పూజించేవారున్న ప్రాంతం. దేశంలో శ్వేతవిప్లవం తీసుకువచ్చింది వారే. యదువంశీయుల సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తోందీ వారే. ఇక్కడ మాత్రం నాయకులు యదువంశీయులను అవమానిస్తున్నార’న్నారు. జయప్రకాశ్ నారాయణ్ అనుచరులుగా ఆయనను ఆకాశానికెత్తిన లాలూ, నితీశ్‌లు ఇప్పుడు ఆ జేపీని ఎమర్జెన్సీ సమయంలో జైలుకు పంపిన కాంగ్రెస్‌తో జత కలిశారన్నారు. ఇవి కులం ఆధారంగా జరిగే ఎన్నికలు కావని.. ఈ ఎన్నికల్లో యువత అభివృద్ది కీలకాంశాలని స్పష్టం చేశారు.
ఆవు పేడ చందనంతో సమానం: లాలూ
పట్నా: దయ్యం ఆవహించి తాను బీఫ్ వ్యాఖ్యలు చేశానంటూ వివరణ ఇచ్చానని తనపై మోదీ అబద్ధాలు చెబుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ ధ్వజమెత్తారు. ‘నేనా వ్యాఖ్యలు చేసినట్లుగా రుజువు చేయి. లేదా నాకు, ప్రజలకు క్షమాపణలు చెప్పు’ అంటూ ట్విటర్‌లో మోదీనిడిమాండ్ చేశారు. ‘నేను గోవులను పూజిస్తాను. ఆవుపేడ మాకు చందనంతో సమానం’ అని పట్నాలో అన్నారు. మోదీ వ్యాఖ్యలను బిహార్ సీఎం నితీశ్ తీవ్రంగా ఖండించారు. బిహార్ ఎన్నికలకు మతం రంగు పులిమే ప్రయత్నమే అదని మోదీపై మండిపడ్డారు. ‘గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ సీఎం మోదీకి రాజధర్మం పాటించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఎందుకు హితవు పలికారో అర్థమవుతోంది.’ అని నితీశ్ ట్వీట్ చేశారు.
బిహార్‌లో పోటాపోటీ!
ఎన్డీయేకు 119, మహాకూటమికి 116
న్యూఢిల్లీ: బిహార్‌లో రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్డీయేకి 119 సీట్లు వస్తాయని సీ ఓటర్ సర్వే పేర్కొంది. 243 సీట్లుగల బిహార్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 122 సీట్లు అవసరం. ఎన్డీయే కి సాధారణ మెజారిటీకి మూడుస్థానాలు తక్కువగా వస్తాయని సర్వే తేల్చింది. జేడీ యూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమికి 116 స్థానాలతో గట్టిపోటీని ఇస్తున్నట్లు తెలిపింది.ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందుతారంది. ఎన్డీయేకి 43%ఓట్లు వస్తాయని, మహాకూటమికి 41%ఓట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. సీఓటర్ సర్వే గురువారం ఇండి యా టీవీ, టైమ్స్ నౌ ఛానళ్లలో ప్రసారమైంది.