పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో.. ఆ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తూ పదే పదే సభను అడ్డుకోవడంతో అంతకుముందు మూడు నాలుగు సార్లు వాయిదా పడిన సభ, చివరకు గురువారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్ సభ సమావేశం కాగానే వామపక్షాలు, జేడీయూ సభ్యులు ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తారు. వారి గొడవతో స్పీకర్ మీరాకుమార్ సభను గంటన్నర పాటు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, విపక్ష నపేత సుష్మా స్వరాజ్ బొగ్గు అంశాన్ని ప్రస్తావించారు. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంపై ప్రధాని ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కనపడకుండా పోయిన పత్రాల్లో కాంగ్రెస్ నాయకుల పేర్లున్నాయని ఆమె ఆరోపించారు. ప్రధాని లోక్ సభకు రావాల్సిందేనని ఆమె గట్టిగా కోరారు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం రెండు వారాల తర్వాత సభకు వచ్చిన హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్వయంగా వెళ్లి ప్రధానిని సభకు తీసుకురావాలని ఆమె కోరారు.
బీజేపీ, జేడీయూ, శివసేన సహా మొత్తం ఎన్డీయే సభ్యులంతా ఈ అంశంపై నినాదాలు చేస్తూ.. సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించగా, సీపీఎం సభ్యులు ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో సభ మధ్యాహ్నం వరకు, ఒంటిగంటకు, రెండు గంటలకు వాయిదా పడి.. చివరకు గురువారానికి వాయిదా పడింది. బుధవారం రాఖీ సందర్భంగా సభకు సెలవు.
అంతకుముందు ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి మునక సంఘటనపై రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఓ ప్రకటన చేశారు. బీహార్ రైలు ప్రమాదం గురించి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఓ ప్రకటన చేశారు. జాతీయ విమానయాన యూనివర్సిటీ, జాతీయ మహిళా యూనివర్సిటీ, పౌర విమానయాన అథారిటీలకు సంబంధించిన మూడు బిల్లులను ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో కూడా పదే పదే అంతరాయాలు ఎదురవుతూనే ఉన్నాయి. బొగ్గు గనులకు సంబంధించిన ఫైళ్ల మాయంపై గందరగోళం చెలరేగడంతో సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత 2.30కి వాయిదా పడింది. రాజ్యసభలో బీజేపీ సభ్యులు రవిశంకరప్రసాద్, వెంకయ్యనాయుడు తదితరులు ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తారు. ఉదయం సమావేశమయ్యాక తొలుత సభను పది నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత తిరిగి సమావేశం కాగా, దీనిపై ప్రకటన చేయడానికి బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ లేచారు. కానీ బీజేపీ సభ్యులు మళ్లీ సభలో గందరగోళం రేపారు. దీంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కొన్ని ఫైళ్లు మాయమైన మాట వాస్తవమేనని శ్రీప్రకాష్ జైస్వాల్ అంగీకరించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు, తర్వాత 2.30 వరకు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక కూడా అదే దృశ్యం పునరావృతం కావడంతో రాజ్యసభను కూడా గురువారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు గురువారానికి వాయిదా
Published Tue, Aug 20 2013 3:21 PM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement