ఫోర్బ్స్ లిస్ట్ లో 'బాలకృష్ణ'
సింగపూర్ : ప్రముఖ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న పతంజలి ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యోగా గురు రామ్ దేవ్ బాబా సహాయకుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఫోర్బ్స్ లిస్ట్ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. సుమారు రూ.16,000 కోట్లు సంపదతో వందమంది ధనవంతుల భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న వినియోగ వస్తువుల సంస్థల్లో పతంజలి ఒకటని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగివున్న బాలకృష్ణను ఎంపిక చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది.
రామ్ దేవ్ కు పతంజలి సంస్థలో వాటాలున్నప్పటికీ , బాలకృష్ణ కార్యకలాపాలు నడిపే వ్యక్తి అనీ, కంపెనీ వాస్తవ బ్రాండ్ అంబాసిడర్ అని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన పతంజలి ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా లయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 22.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.