ట్విట్టర్‌లో ఉర్జిత్ లక్ష్యంగా పవన్ విమర్శలు
హైదరాబాద్: 'మిస్టర్ ఉర్జిత్.. ఈయన (ఏపీలోని కర్నూలుకు చెందిన) దివంగత బాలరాజు. మీరు ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అభాగ్యులలో ఈయన ఒకరు' అంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ లక్ష్యంగా ట్విట్టర్‌లో జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతున్నా.. ఈ దేశంలో మనుషులు అశుద్ధం మోసే జాఢ్యాన్ని రూపుమాపలేకపోయాని, అలాంటి దేశంలో 'క్యాష్‌లెస్ ఎకానమీ' (నగదు రహిత ఆర్థిక వ్యవస్థ) సాధ్యమని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఎంతో ఆలోచించి ఉర్జిత్ పటేల్ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు వల్ల ఆయన సహచర భారతీయులైన ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు, పండ్లు, కూరగాయాల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు ఇలా చాలామంది కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కిలోమీటర్ల పొడవున్న క్యూలలో నిలబడలేక సామాన్యులు ప్రాణాలు విడుస్తుండగా.. అక్రమార్కులు మాత్రం తమ ఇళ్లలో సుఖంగా కూచొని తమ సంపదను మార్చుకుంటున్నారని విమర్శించారు. 86శాతం నగదు బ్యాంకుల్లో డిపాజిట్ కావడంతో ఉర్జిత్ పటేల్ ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తుండవచ్చు. నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందని గర్వంగా చెప్పుకుంటుండొచ్చు. కానీ నిజమేమిటంటే.. మీరు పాత దానిని కొత్త దానితో మార్చారు. ఇక దోపిడీదారుల వర్గంలో బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా చేరిపోయారు' అంటూ పవన్ పేర్కొన్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) 20 December 2016