స్టేట్ బ్యాంక్ బాదుడు షురూ!
స్టేట్ బ్యాంక్ బాదుడు షురూ!
Published Sat, Mar 4 2017 9:18 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటు బ్యాంకుల బాటలోనే నడుస్తోంది. ఖాతాలలో కనీస మొత్తం ఉంచకపోతే పెనాల్టీలు విధిస్తామని చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమలవుతాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కనీసం రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 3వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయల చొప్పున కనీస నిల్వ ఖాతాల్లో ఉండాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఖాతాలలో ఉన్న మొత్తానికి, కనీస నిల్వకు మధ్య ఎంత తేడా ఉందో దాన్ని బట్టి పెనాల్టీలు ఉంటాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో రూ. 3750 (75%) కంటే తక్కువ ఉంటే వంద రూపాయలు, దానిపై సేవాపన్నును పెనాల్టీగా వేస్తారు. అదే 50-75 శాతం మధ్య అయితే 75 రూపాయలు, దానిపై సేవాపన్ను పనడుతుంది. సగం కంటే తక్కువ తేడా ఉంటే 50 రూపాయలు, సేవాపన్ను పెనాల్టీగా వేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఖాతాల్లో కనీస నిల్వ మొత్తం ఉంచుకోకపోతే రూ. 25-50, సేవాపన్ను పెనాల్టీగా పడుతుంది.
బ్యాంకుకు వస్తే మోతే
బ్రాంచిలో నెలకు మూడుసార్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే 50 రూపాయల చొప్పున చార్జీ విధిస్తారు. అయితే ఎంత మొత్తం నగదు లావాదేవీ అనే పరిమితి మాత్రం లేదు. గతంలో కూడా ఇలా బ్యాంకులో నగదు లావాదేవీల మీద చార్జీలు ఉండేవని, వాటిని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు ఉచితంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున కస్టమర్లు బ్రాంచికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు.
Advertisement