పెట్రోల్‌పై తగ్గింపు... డీజిల్‌పై పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వరంగ చమురు సంస్థలు గురువారం స్వల్పంగా సవరించాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.15 చొప్పున ధరను తగ్గించి అదే సమయంలో డీజిల్‌పై లీటరుకు 50 పైసల చొప్పున ధర పెంచాయి. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ లేదా స్థానిక పన్నుల్లో తేడాల వల్ల ఈ ధరల్లో వ్యత్యాసాలు వెల్లడించాయి. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ బ్యారెల్‌కు 113 డాలర్ల నుంచి 112 డాలర్లకు తగ్గడంతోపాటు డాలర్‌తో రూపాయి మారకపు విలువ కాస్త బలపడటంతో పెట్రోల్ ధరను తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే డీజిల్ రిటైల్ విక్రయాలపై నష్టాలను పూడ్చుకునేందుకు ధరను ప్రతి నెలా స్వల్ప మొత్తాల్లో పెంచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన అనుమతి నేపథ్యంలో డీజిల్ ధరను పెంచినట్లు వివరించింది. పెట్రోల్ ధరలను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న పెట్రోల్‌పై లీటరుకు రూ. 3.05 చొప్పున చమురు సంస్థలు ధరను తగ్గించాయి. మరోవైపు డీజిల్ ధరలను పెంచడం ఈ ఏడాది జనవరి 17 నుంచి ఇది 10వసారి. కాగా, సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 49.50 చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 954.50కి తగ్గింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు
నగరం పాత ధర కొత్త ధర
హైదరాబాద్ 79.08 77.57
విశాఖపట్నం 77.77 76.27
విజయవాడ 78.15 76.60
వరంగల్ 78.56 77.25
తిరుపతి 78.64 77.23