పతకం పోయింది.. ఇక జర్నలిస్ట్ అవుతా!
భారత్ క్రీడాభిమానుల ఆశల్ని నిలబెట్టేందుకు చివరివరకు పోరాడిన షూటర్ అభినవ్ బింద్రా వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయాడు. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో బ్రిందా తుదివరకు పోరాటపటిమ కనబరిచి.. నాలుగోస్థానంలో నిలిచాడు. ఈ నిరాశాజనకమైన ఫలితంతో బింద్రా అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడబోతున్నది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాన్ని అందించి దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన బింద్రా.. ఇక విరామం తీసుకోబోతున్నాడు.
విశ్వక్రీడల్లో వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత ఆటగాడిగా కీర్తి గడించిన బింద్రా.. ఫైనల్ తర్వాత మీడియాతో మాట్లాడాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు తర్వాత కాస్తా రిలాక్స్‌డ్‌గా కనిపించిన బింద్రా సరదాగా జోకులు పేల్చారు. నిజం చేదుగా ఉంటుందనే విషయాన్ని క్రీడలు ఎప్పుడూ నేర్పిస్తాయని, ఆ పాఠాలను నేర్చుకొని ముందుకుసాగడమే ఏ ఆటగాడైనా చేయాల్సిన పని అని ఆయన పేర్కొన్నారు.
'నాకు సాధ్యమైనంత మేర ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను. కేవలం ప్రపంచంలో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పతకంతో ఇంటికి వెళ్లే అవకాశముంది. ఇదేదో తొమ్మిది దేశాలు ఆడే ఆటకాదు. ఇందులో 200 దేశాలు పాల్గొంటాయి. చాలా కష్టమైన క్రీడ ఇది' అని బింద్రా అన్నారు. రిటైరైన తర్వాత జర్నలిస్టు కావాలని అనుకుంటున్నానని, అది కుదరకపోతే కేక్ షాప్ పెట్టుకొని శేష జీవితాన్ని గడుపుతానని బింద్రా సరదాగా జోకులు వేశారు.