ప్లాట్ ఫాం స్కూల్.. పోలీసు మాస్టారు
న్యూఢిల్లీ: సాధారణంగా పోలీసులు వస్తున్నారంటే చాలు చిన్నపిల్లలేకాదు పెద్దవారికి కూడా చాలా భయం ఉంటుంది. వారి చేతిలో లాఠీ, చంకలో తుపాకీ, బూట్ల చప్పుడు భయం కలిగిస్తాయి. కానీ, అలాంటిది కనిపిస్తే చాలు తన్ని తరిమేసే పోలీసు దగ్గరికి రైల్వే స్టేషన్లలో పాపాడ్స్ అమ్ముకునే బతికే పిల్లలు విధిగా ఏం భయం లేకుండా వెళుతుంటే. అది కూడా టైం అయింది రండి పాఠాలు చెప్తురుగానీ అని ఆయనను పిలిస్తే.. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రోజూ ఇదే జరుగుతుంది.
అప్పటి వరకు ఏ పోలీసులు వచ్చిన తమను పాపాడ్స్ అమ్ముకోనివ్వకుండా దెబ్బలు కొట్టి జీపులో ఎక్కించుకెళ్లే పోలీసులు, తన్ని తరిమేసి పోలీసులను చూసిన అక్కడి మురికివాడల్లో నివసించే పిల్లలు తొలిసారి మానవత్వాన్ని, సేవాగుణాన్ని ఓ పోలీసు రూపంలో బహుమానంగా పొందారు. ప్రేమగా దగ్గరకు తీసుకొని ఓపికతో విద్యాబుద్ధులు నేర్పించే గురువులాంటి పోలీసుకు చిక్కారు. దీంతో వారు రోజంతా ఏం చేసినా కచ్చితంగా ఓ గంటపాటు తప్పకుండా పుస్తకం పట్టాల్సిందే నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిందే.
నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాలోని పిల్లలు ప్రతి రోజు పాపాడ్స్ అమ్ముకునేందుకు రైల్వేస్టేషన్కు రావడం, అమ్ముకుంటుండటం, అప్పుడప్పుడు వారిలో వారే కొట్టుకోవడం, ఒక క్రమ పద్ధతిలేకుండా జీవించడం పరిపాటి. కొన్నిసార్లు పోలీసుల చేతికి చిక్కితే కొట్టి జీపులో తీసుకొని వెళ్లేవారు.
అయితే, గత నాలుగు నెలల కిందట ధరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా అక్కడి స్టేషన్ కు వచ్చాడు. అయితే, ఆ పిల్లల గురించి అతడు కొత్తగా ఆలోచించి రోజు గంటపాటు చదువుకోవాలని ఆ తర్వాత పాపాడ్స్ అమ్ముకునేందుకు అనుమతిస్తానని చెప్పాడు. అలా ఆ పిల్లలు, కానిస్టేబుల్ మధ్య ఒప్పందం కుదుర్చుకొని అప్పటి నుంచి ఆ స్టేషన్ ప్రాంగణంలోని ఓ చోటు ప్లాట్ ఫాం పాఠశాలగా మారింది. ధరమ్ వీర్ సింగ్ చూపిస్తున్న మానవత్వం, సేవాదృక్పథంపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.