ప్లీజ్ అమ్మ.. వద్దు అమ్మ అని వేడుకున్నా..
తను బిడ్డల్ని ఎంతగానో ప్రేమించేది. వారి గురించి గర్వంగా చెప్పుకొనేది. ఆ రోజు పర్పుల్ రంగు డ్రేస్ వేసుకొంది. కానీ ఏం జరిగిందో ఏమో తానే చేజేతులా ఇద్దరు కూతుళ్లనీ తుపాకీతో పొట్టనబెట్టుకుంది. ఇది అమెరికాలోని హూస్టన్‌లో తన ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపి.. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో చనిపోయిన క్రిష్టీ షీట్స్ గురించి ఆమె బంధువులు, స్నేహితులు ఆన్‌లైన్‌లో వెల్లడించిన విషయం.
క్రిష్టీ తన కూతుళ్లు మాదిసన్ (17), టైలర్ (22)లను ఎందుకు చంపింది అనే దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు. కాల్పుల గురించి తెలిపేందుకు క్రిష్టీ ఇంటి నుంచి 911 కాల్స్ వచ్చాయని, ఆ కాల్స్‌లో క్రిష్టీ కూతుళ్లు ఏడుస్తూ వేడుకుంటున్న ధ్వనులు స్పష్టంగా వినిపించాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్స్ ప్రకారం.. ఇద్దరు కూతుళ్లు బిగ్గరగా ఏడుస్తూ.. తమను ప్రాణాలతో విడిచిపెట్టామని తల్లిని వేడుకున్నారు. ‘ప్లీజ్ క్షమించి.. ప్లీజ్ మమ్మల్ని షూట్ చేయకు’ అని ఇద్దరూ కూతుళ్లు అభ్యర్థించారు. ‘ప్లీజ్! క్షమించు.. తుపాకీతో నావైపు గురిపెట్టకు’ అని ఓ కూతురు వేడుకోగా.. ‘నేను నీకు మాట ఇస్తున్నాను. ఏం చేయమంటే అది చేస్తాను’ అని మరో కూతురు వేడుకుంది. (ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ)
ఆ తర్వాత గట్టిగా అరుపులు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫోన్ పెట్టేయకుండా ఆన్‌లో ఉన్న ఈ కాల్స్‌తో వెంటనే స్పందించిన పోలీసులు త్వరగానే క్రిష్టీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ క్రిష్టీ ఇద్దరు కూతుళ్లు నెత్తుటి మడుగులో కూలిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు చేసిన అభ్యర్థనలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు వచ్చినప్పటికీ క్రిష్టీ తుపాకీ కిందపడేయకపోవడంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అమెరికా వాసులను షాక్ గురిచేసిన ఈ కాల్పుల ఉదంతంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో నెలకొన్న విచ్చలవిడి తుపాకీ సంస్కృతిని కట్టడి చేయాలని, అమెరికన్లకు మానసిక ఆరోగ్యం, కుటుంబబాంధవ్యాలపై సామాజికంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని నిపుణులు చెప్తున్నారు.